ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలకు ఇచ్చే పింఛన్లపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సామాజిక భద్రత పింఛన్ల తనిఖీని పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
గత ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీలు చేపట్టి అనర్హులు ఎవరు అనేది గుర్తించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ పైలట్ ప్రాజెక్ట్
ఈ క్రమంలోనే రేపు, ఎల్లుండి పైలెట్ ప్రాజెక్టుగా పింఛన్ల తనిఖీ చేయనుంది. మొదటి విడతలో భాగంగా జిల్లాకు ఒక గ్రామానికి ఒక వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు. అక్కడ తనిఖీలను నిర్వహించటానికి పక్క మండలానికి చెందిన అధికారులను నియమిస్తారు. ఈ ఒక్క బృందం 40 పింఛన్లను పరిశీలించి దీనిపైన నివేదికను తయారు చేస్తారు.
జిల్లా అధికారులకు పింఛన్ ల తనిఖీపై ఆదేశాలు
ఆయా సచివాలయాల పరిధిలోని పింఛన్ దారుల సంఖ్యను బట్టి ఎన్ని బృందాలను ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకొని ఆ బృందం ద్వారా లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఇక ఈ మొత్తం ప్రక్రియను సోమ, మంగళవారాలలో పూర్తి చేయాలని సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అనర్హులకు పింఛన్లు ఇచ్చారని విమర్శలు
ఇక ఈ తనిఖీలలో వెల్లడైన వివరాల ఆధారంగా రాష్ట్రవ్యాప్త పరిశీలన పైన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేతలు ఇలా ప్రతి విభాగంలో స్థానికంగా ఉండే వైసీపీ నేతల సిఫారసుల మేరకు అనర్హులైన వారికి కూడా పింఛన్లు ఇచ్చారని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అంతేకాదు దీనిపైన ఆరోపణలు కూడా వెల్లువగా మారాయి.
అర్హులకు పింఛన్ లు అందటం లేదని ఆరోపణలు
మరోవైపు అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. చాలామంది అర్హత ఉన్నవారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదని, గత జగన్ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల మందికి పింఛన్లు తొలగించారని విమర్శలు వస్తున్న వేళ సామాజిక పింఛన్ల తనిఖీకి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తనిఖీలు అందుకే… వారిలో ఆందోళన
ఈ తనిఖీ ద్వారా అనర్హులను ఏరివేసి, అర్హులకు పింఛన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావిస్తుంది. అయితే తాజాగా పింఛన్ల తనిఖీ నేపథ్యంలో తమ పేరు ఏమైనా తీసేస్తారా అని సామాజిక పింఛన్లు అందుకుంటున్న పేద వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.