ఏపీలో ఇక వారికే పెన్షన్లు-అలా కట్ చేయండి- కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

www.mannamweb.com


ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెన్షన్లపై జరుగుతున్న చర్చకు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. రాష్టంలో పెన్షన్లు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి కోత పెట్టాలో స్పష్టం చేశారు.

అలాగే అనర్హులకు పెన్షన్లలో కోత విధించే విషయంలో మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. దీంతో కలెక్టర్లు దీనిపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పెన్షన్లపై క్షేత్రస్ధాయిలో చర్యలు మొదలుకాబోతున్నాయి.

ఇవాళ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు పెన్షన్లపై స్పందించారు. రాష్ట్రంలో వివిధ సామాజిక ఫించన్లు అర్హులకు అందేలా, అనర్హులను తొలగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సాంకేతిక, హైబ్రిడ్ విధానాలను వినియోగించి ఫిజికల్ వెరిఫికేషన్‌తో అనర్హులను తొలగించాలని సూచించారు.

ముఖ్యంగా వికలాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.సర్టిఫికెట్లు జారీ చేసే డాక్టర్లు మెడికల్ బోర్డు మార్గదర్శకాలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సదరం సర్టిఫికెట్ల జారీలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ దీనిపై స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రతి నెలా సుమారు 64 లక్షల సామాజిక ఫించన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

స్వయంగా సీఎం చంద్రబాబు ప్రతి నెల ఒక్కో జిల్లాలో ఒక గ్రామంలోని ఫించన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారని గుర్తుచేశారు. అనర్హులు ఫించన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో 26 జిల్లాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామ, ఒక వార్డు సచివాలయంలో ఈ నెల 9,10 తేదీల్లో ఒక పైలెట్ సర్వే నిర్వహించారని వెల్లడించారు. సర్వేలో మొత్తం 10,958 ఫించన్లు తనిఖీ చేయగా వాటిలో 10,020 ఫించన్లు సక్రమంగా ఉండగా 563 అనర్హంగా ఉన్నట్టు గుర్తించామని శశిభూషణ్ తెలిపారు. అనర్హత గల ఫించన్లలో అధికంగా దివ్యాంగ ఫించన్లు ఉన్నట్టు తేలిందన్నారు.