YCP: వైసీపీని ఎప్పుడూ నమ్మని విశాఖ ప్రజలు

YCP: గత ఎన్నికల్లో జగన్ అంతులేని విజయం సాధించారు. ఎన్నికల్లో మాత్రం ఎవరూ చవిచూడని ఓటమి పాలయ్యారు. అయితే ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలపై తన ఉనికిని చాటుకున్నా..


విశాఖ నగరంలో మాత్రం పట్టు సాధించేందుకు ఆపసోపాలు పడ్డారు. మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి విశాఖ నగరం పట్టు చిక్కలేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా విశాఖ నగరంలో మాత్రం టిడిపి హవా నడిచింది. 2024 ఎన్నికల్లో అయితే వైసీపీకి ఛాన్స్ లేకుండా పోయింది.

విశాఖ మహానగరంలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితోపాటు భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. 2014 ఎన్నికల్లో నగరంలోని నాలుగు నియోజకవర్గాలు టిడిపి కూటమి దక్కించుకుంది. విశాఖ ఉత్తరంలో బిజెపి, విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో టిడిపి పాగా వేసింది. అటు గాజువాక తో పాటు భీమిలి, పెందుర్తిలో సైతం టిడిపి అభ్యర్థులు గెలిచారు.

2019 ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలను టిడిపి కైవసం చేసుకుంది. గాజువాక తో పాటు భీమిలిలో మాత్రం వైసీపీ గెలిచింది. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, పశ్చిమ నుంచి గణబాబు, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచారు. అయితే ఎన్నికల అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అన్ని స్థానాలను గెలుచుకోవాలని జగన్ భావించారు. బలమైన అభ్యర్థులను బరిలో దించారు. కానీ ఒక్కటంటే ఒక్కచోట కూడా వైసిపి గెలవలేదు. ముఖ్యంగా జగన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కనీసం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారన్న కృతజ్ఞత కూడా ప్రజలకు లేకుండా పోయింది. రాజధాని అనే అంశంతో విశాఖను ఇబ్బంది పెడతారని భావించిన ప్రజలు.. వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.