Permanent Education Number: ఏపీలో విద్యార్థులకు పెన్ నంబర్ తప్పనిసరి.. పత్రాల కోసం ఒత్తిడి చేయొద్దని విద్యాశాఖ ఆదేశం

www.mannamweb.com


Permanent Education Number: ఏపీలో ప్రతి విద్యార్థికీ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) తప్పనిసరి చేయాలరి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ గారు మార్గదర్శకాలు జారీ చేశారు.
విద్యార్థులను మరో పాఠశాలలో చేర్చుకోవడం విషయంలో యాజమాన్యాలు ఆలస్యం చేయవద్దని హెచ్చరించారు.

ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడం, ఇతర పాఠశాలలకు బదిలీ చేయడం వంటి ప్రక్రియ కోసం యాజమాన్యాలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రికార్డ్ షీట్, TC, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, ఇతర సర్టిఫికేట్‌ల వంటి పత్రాల కోసం పట్టుబట్టొద్దని సూచించారు.

విద్యార్ధులకు పాఠశాలల్లో ప్రవేశం కల్పించడానికి పత్రాలను సాకుగా చూపొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు మార్గనిర్దేశాలు జారీ చేశారు.
కొత్త పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఏకీ భవించకపోవడం 2,5,7,8 తరగతుల విద్యార్థుల బదిలీలు సక్రమంగా జరగడం లేదని , విద్యార్థులను ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు బదిలీ చేసే ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులు ఆలస్యం చేయడం వల్ల తల్లిదండ్రులకు కష్టాలతో పాటు పిల్లలు అటు పాత పాఠశాలలో ఉండక, ఇటు కొత్త పాఠశాలలో చేరక ‘సిస్టమ్ డ్రాప్ బాక్స్’లో ఉండిపోతున్నారని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు పలు సూచనలు చేశారు.

పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్

ఆన్‌లైన్‌లో టీసీ సౌకర్యం ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలలు పాత విధానాన్ని అనుసరిస్తుండడంతో ఆయా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా, అటువంటి విద్యార్థులందరూ ఏదైనా పాఠశాలలో ప్రవేశం పొంది, డిజిటలైజ్ అయ్యే వరకు “సిస్టమ్ డ్రాప్”గా ఉంచుతారు.
ఈ విద్యా సంవత్సరంలో ఇలాంటి ఇబ్బందులు అధిగమించడానికి విద్యాశాఖ కొత్త తరహ ‘విద్యార్థుల బదిలీ ప్రక్రియ’ ప్రారంభించింది. బదిలీలను సులభతరం చేయడానికి విద్యార్ధులను ట్యాగింగ్ చేశారు. తర్వాత చదవాల్సిన ఉన్నత తరగతి ఎక్కడైతే లేదో అలాంటి పాఠశాలకు సౌకర్యం కల్పించారు.

ఈ సౌకర్యాన్ని వినియోగిస్తూ ప్రధానోపాధ్యాయులు ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆప్షన్ ఫారం తెప్పించుకుని సంబంధిత స్కూళ్లను వాళ్ల లాగిన్ లో నమోదు చేయాలి.

తల్లిదండ్రులు నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకుని, అటువంటి విద్యార్థులందరిని మ్యాప్ చేసిన తర్వాత ఆ డేటా ఆటోమేటిక్‌గా రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి ఎంపిక చేసిన పాఠశాలలకు బదిలీ చేస్తారు.
అన్ని మేనేజ్‌మెంట్‌ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ వారి తర్వాతి తరగతిలో చేరేలా పాఠశాలకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థి సమాచార సైట్‌లో ప్రొవిజన్ ఇవ్వడమైంది.

ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల నుండి OPTION ఫారమ్‌ను తీసుకుని, విద్యార్థికి నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకోనివ్వాలి. ఆ తర్వాత విద్యార్థులందరూ ప్రమోట్ చేయబడిన తరగతులకు తాము ఎంచుకున్న పాఠశాలలకు బదిలీ అవుతారు. వారు ఎంచుకున్న పాఠశాలకు విజయవంతంగా ట్యాగ్ చేసిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు SMS ద్వారా సందేశం పంపిస్తారు.

సాంప్రదాయ తప్పనిసరి పత్రాలను తొలగింపు….

కొన్ని దశాబ్దాలుగా, పాఠశాలలో ప్రవేశానికి తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం మొదలైనవి ఉండేవి. ఆ పత్రాలను పొందడానికి, సమర్పించడానికి తల్లిదండ్రులందరూ అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.

విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం “మరొక పాఠశాలలో ప్రవేశాన్ని తిరస్కరించడానికి లేదా ఆలస్యం చేయడానికి బదిలీ సర్టిఫికేట్ కారణం కాకూడదు.

బదిలీ సర్టిఫికేట్‌లను పొందడంలో విధానపరమైన అడ్డంకులను తొలగించడానికి రాష్ట్రాలు సంస్కరణలను ఏర్పాటు చేయడానికి కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించారు.

1వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు ఇచ్చిన అన్ని పత్రాలను డిజిటలైజ్ చేయడం వల్ల, విద్యార్థులను ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు బదిలీ చేసేటప్పుడు ఎలాంటి పత్రాల కోసం పట్టుబట్టకూడదని నిర్ణయించారు. ఈ ప్రక్రియ కోసం చైల్డ్ ఐడీ /ఆధార్ నంబర్/PEN (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) సరిపోతుందని, ఆన్‌లైన్ TC/Offline TC అవసరం లేదని గమనించాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోసం మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన సర్టిఫికేట్‌లను అనుసరించాలి. అలాంటి విద్యార్థుల డేటా అంతా వారి రాష్ట్రంలోని UDISE+ పోర్టల్ నుండి డ్రాప్ చేసి, ఆంధ్రప్రదేశ్‌లో మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఒకటో తరగతిలో నమోదు చేసుకునే సమయంలోనే విద్యార్థులందరికీ DIGILOCKER ఖాతాలను ప్రారంభిస్తున్నారు.

శాశ్వత విద్యా సంఖ్య (PEN) తప్పనిసరి

పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (PEN) అనేది భారతదేశంలోని విద్యార్థులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా కేటాయిస్తున్నారు.

PEN అనేది ఒకటో తరగతి అడ్మిషన్ సమయంలో ప్రతి విద్యార్థికి కేటాయించిన ఒక విశిష్ట సంఖ్య. ఆ సంఖ్య వారి చదువు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం UDISE+ పోర్టల్ ద్వారా విద్యార్థులందరికీ దీన్ని అందిస్తోంది.
ఈ PEN ప్రారంభ సంవత్సరంలోనే ఇవ్వబడుతుంది మరియు జీవితాంతం చెల్లుబాటు అవుతుందని కమిషనర్‌ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం నుండి ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు మినహా మిగతా విద్యార్థులందరికీ పెన్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. UDISE పోర్టల్‌లో విజయవంతంగా ప్రవేశించిన తర్వాత ఒకటో తరగతి విద్యార్థులకు ఈ నంబర్ కేటాయిస్తున్నట్టు తెలిపారు. పెన్‌ కేటాయింపు కోసం ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.