జగన్, షర్మిల ఆస్తి పంపకాల వ్యవహారంపై పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఈ ఇష్యూపై ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ జగన్‌ను టార్గెట్ చేస్తుంటే.. వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేస్తూ పంచ్‌లు పేలుస్తున్నారు. తాజాగా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల రాసిన లేఖని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్‌లో ఎలా పోస్టు చేస్తారని నిలదీసింది. బిగ్ బ్లాస్ట్ అంటూ పోస్ట్ చేసి.. ఈ గొడవని రెచ్చగొట్టి, నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
‘దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదంటారా? ఇచ్చిన హామీలను అమలు చేయలేక.. పాలనా వైఫల్యం నుంచి ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కాదా? దిగజారుతున్న లా అండ్ ఆర్డర్‌తో కడతేరుతున్న ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాల నుంచి, డయేరియా మరణాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ తప్పుడు రాజకీయాలు కాదా?’ అని వైసీపీ ప్రశ్నించింది.
‘రాజకీయంగా జగన్ అంతాన్ని కోరుకుంటున్నవారితో.. తన వంతు పాత్ర పోషిస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలిసేలా జగన్ తన సోదరికి రాసిన అన్ని లేఖలను, తన స్వార్జిత ఆస్తుల్లో ఇవ్వాలనుకున్న ఆస్తుల వివరాల ఎంవోయూను కూడా వెల్లడిస్తున్నాం. తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు కాకుండా వాస్తవాలకు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో విడుదల చేస్తున్నాం’ అని వైసీపీ స్పష్టం చేసింది.
ఈ ఇష్యూపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘షర్మిల పాదయాత్ర చేస్తే వద్దని నేను చెప్పాను. భవిష్యత్తులో చాలా తగాదాలు వస్తాయని కూడా చెప్పాను. జగన్.. నమ్మకంతో మా కుటుంబం అలాంటిది కాదు అని అన్నారు. జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన పార్టీలో చేరి.. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకుడితో కుట్రలు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకున్న వారు ఎవరైనా చంద్రబాబుతో స్నేహం చేస్తారా. ఆస్తి కోసం మాత్రం రాజశేఖర్ రెడ్డి పేరు బొమ్మ కావాలి. వైఎస్సార్ ఉన్నప్పుడు.. ఏ ఆస్తి అయిన వైఎస్ఆర్‌దే అన్నప్పుడు.. భారతి సిమెంట్‌కు షర్మిల సిమెంట్ అని పేరు ఎందుకు పెట్టలేదు’ అని పేర్ని నాని ప్రశ్నించారు.
‘జగన్ తన సొంత అమ్మ, చెల్లిపై కేసు వేసారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈడీ ఎటాచ్‌మెంట్‌లో ఉన్న ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేస్తే జగన్ న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసి కూడా చేసారు. నాడు టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పూరితంగా కేసులు పెడితే.. జగన్ జైలుకు వెళ్లారు. నేడు స్టేటస్ కో ఉన్న ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసి జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే కుట్రలో షర్మిల కూడా భాగం అవుతున్నారు. జగన్ బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి రాకూడదు కనుకే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేస్ ఫైల్ చేయాల్సి వచ్చింది’ అని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.