పర్సనల్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా? రెండింటికీ లింకేంటి?

www.mannamweb.com


ఇటీవల కాలంలో పర్సనల్ లోన్(వ్యక్తిగత రుణం) తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సులభంగా యాప్ ల ద్వారా మంజూరవడం, ఎటువంటి పూచికత్తు గానీ, తనఖా గానీ, పత్రాలు గానీ అవసరం లేకపోవడంతో అందరూ వీటికి మొగ్గుచూపుతున్నారు.

అత్యవసర నిధుల కోసం వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే పర్సనల్ లోన్ సులభంగా వస్తుంది కానీ.. అలా రావాలంటే ఒక్కటే కీలకమైన అంశం ఉంటుంది. అదే మీ క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్. వ్యక్తిగత రుణాలు మీకు మంజూరు కావాలంటే మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. లేకపోతే రుణం మంజూరు కాదు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. పర్సనల్ కావాలంటే సిబిల్ స్కోర్ ఉండాలి. అదే సమయంలో పర్సనల్ తీసుకోవడం ద్వారా మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. ఇక్కడే గమ్మతైన లాజిక్ ఉంది. అది తెలియాలంటే ఈ కథనం పూర్తి వరకూ .

క్రెడిట్ స్కోర్‌ అంటే..

క్రెడిట్ స్కోర్ అనేది రుణదాతలకు మీ క్రెడిట్ యోగ్యతను సూచించే సంఖ్య. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది, దీర్ఘకాలికంగా అధిక స్కోర్‌లు మెరుగైన ఆర్థిక ప్రవర్తనను సూచిస్తాయి. 750 కంటే ఎక్కువ స్కోర్ అద్భుతమైనదిగా పరిగణిస్తారు. ఇది మీకు అనుకూలమైన వడ్డీ రేట్లలో వ్యక్తిగత రుణాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఈ సిబిల్ స్కోర్ ఆధారంగానే వ్యక్తులకు లోన్ అర్హత, దాని వడ్డీ రేటు నిర్ణయిస్తారు. రుణదాతలు రుణాన్ని ఆమోదించే ముందు క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా తనిఖీ చేస్తారు. అధిక స్కోర్‌ ఉన్న వ్యక్తులకు రుణదాతలు లోన్లు సులభంగా మంజూరు చేస్తారు.

క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం..

మీరు పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ సానుకూలంగా, ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది.

విభిన్న తరహా రుణాలు తీసుకోవాలి.. మీ క్రెడిట్ స్కోర్ అనేక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. వాటిలో ఒకటి మీరు కలిగి ఉన్న వివిధ రకాల లోన్లు. మీరు ఒకే తరహా రుణాలు కాకుండా విభిన్న రకాల రుణాల మిశ్రమాన్ని కలిగి ఉంటే అది మీ క్రెడిట్ స్కోర్‌ను సానుకూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

సకాలంలో తిరిగి చెల్లించాలి.. మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలలో ఒకటి మీ రీపేమెంట్ చరిత్ర. మీరు పర్సనల్ లోన్ తీసుకుని, డిఫాల్ట్ లేకుండా సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేస్తే, మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. రుణదాతలు మీ రీపేమెంట్ ప్రవర్తనను క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తారు. సకాలంలో చెల్లింపుల రికార్డు బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణను చూపుతుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది.

హార్డ్ ఎంక్వైరీ వద్దు.. మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, రుణదాత మీ క్రెడిట్ రిపోర్ట్‌పై క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. దీనిని హార్డ్ ఎంక్వైరీ అని కూడా అంటారు. ప్రతి హార్డ్ ఎంక్వైరీతో మీ క్రెడిట్ స్కోర్ స్వల్పంగా పడిపోతుంది. ఈ తగ్గుదల సాధారణంగా తాత్కాలికమైనదే అయినప్పటికీ ప్రభావం అయితే చూపుతంది. కొన్ని నెలల్లోనే అది మెరుగయ్యే అవకాశం కూడా ఉంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణ దరఖాస్తులు చేస్తే అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత..

వ్యక్తిగత రుణం తీసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడం చాలా అవసరం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండి.. మీ క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అలవాటు చేసుకోండి. ఇది మార్పులను పర్యవేక్షించడంలో.. స్కోర్‌ను ప్రభావితం చేసే ఏవైనా వ్యత్యాసాలను సరిదిద్దడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై మీ లోన్ ప్రభావాన్ని ట్రాక్ చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది.

ఈఎంఐల రిమైండర్‌లు.. ఆలస్యంగా చెల్లింపులు చేయడం లేదా ఈఎంఐలను చెల్లించకుండా ఉండటం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ ఈఎంఐలు ప్రతి నెలా సకాలంలో చెల్లించడానికి రిమైండర్‌లు లేదా ఆటోమేటిక్ చెల్లింపులను సెటప్ చేయండి. మీకు అనేక రుణాలు లేదా క్రెడిట్ కార్డ్‌లు ఉన్నట్లయితే, ముందుగా అధిక-వడ్డీ రుణాలను క్లియర్ చేసేలా చూసుకోండి.

ఎక్కువ రుణం వద్దు.. అందించిన గరిష్ట రుణ మొత్తాన్ని రుణం తీసుకోవడానికి ఉత్సాహం కలిగినా, మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు అవసరమైన దానికంటే ఎక్కువ రుణం తీసుకోవడం ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఆలస్య చెల్లింపులు, డిఫాల్ట్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.