PhonePe కొత్త ఫీచర్.. ఒక క్లిక్‌తో చెల్లింపు

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే (PhonePe), ఆన్‌లైన్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. తన పేమెంట్ గేట్‌వే ప్లాట్‌ఫామ్‌లో వీసా (Visa) , మాస్టర్ కార్డ్ (Mastercard) వినియోగదారుల కోసం ‘PhonePe PG Bolt’ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.


ఈ నూతన సాంకేతికత ద్వారా కోట్లాది మంది డెబిట్ , క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ చెల్లింపులను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సులభంగా , భద్రంగా పూర్తి చేసే అవకాశం కలిగింది. డివైజ్ టోకనైజేషన్ (Device Tokenisation) అనే అత్యాధునిక పద్ధతిని ఉపయోగించడం ద్వారా, వినియోగదారులు తమ కార్డ్ వివరాలను ప్రతిసారీ నమోదు చేసే శ్రమను ఇది తప్పిస్తుంది.

ఈ ఫీచర్ యొక్క ప్రధాన విశిష్టత ఏమిటంటే, వినియోగదారులు తమ కార్డును ఫోన్‌పే యాప్‌లో ఒక్కసారి టోకనైజ్ (సేవ్) చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫోన్‌పే పేమెంట్ గేట్‌వేతో అనుసంధానమై ఉన్న ఏ మర్చంట్ యాప్‌లోనైనా పదేపదే కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు జరపవచ్చు. మరీ ముఖ్యంగా, ఒకసారి కార్డు సేవ్ అయిన తర్వాత అదే డివైజ్‌లో తదుపరి లావాదేవీలు చేసే సమయంలో CVV నంబర్‌ను నమోదు చేయాల్సిన పనిలేదు. ఇది పేమెంట్ ప్రక్రియలో ఉండే అదనపు స్టెప్స్‌ను తగ్గించి, ‘వన్-క్లిక్’ అనుభూతిని ఇస్తుంది. సాధారణంగా పేమెంట్ చేసే సమయంలో వేరే వెబ్‌పేజీలకు రీడైరెక్ట్ అవ్వడం వల్ల లావాదేవీలు మధ్యలో ఆగిపోయే (Drop-offs) ప్రమాదం ఉంటుంది, కానీ ‘బోల్ట్’ ఫీచర్ ద్వారా మర్చంట్ యాప్ లోపలే లావాదేవీ పూర్తవుతుంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులకే కాకుండా వ్యాపారులకు (Merchants) కూడా గొప్ప ప్రయోజనం కలగనుంది. లావాదేవీల సక్సెస్ రేటు గణనీయంగా పెరుగుతుందని, సాంకేతిక లోపాలు తగ్గి చెల్లింపులు వేగంగా జరుగుతాయని ఫోన్‌పే చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ షెకావత్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం భద్రతకు మాత్రమే పరిమితం కాకుండా, వినియోగదారులకు సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపుల వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సున్నితమైన కార్డ్ సమాచారాన్ని సెక్యూర్ టోకన్లుగా మార్చడం వల్ల హ్యాకింగ్ లేదా డేటా చోరీ వంటి ప్రమాదాల నుండి వినియోగదారులకు గరిష్ట రక్షణ లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.