దక్షిణ కొరియా(SouthKorea)లోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ఓ దుర్ఘటన (PlaneCrash) దేశాన్ని శోకంలో ముంచెత్తింది. ఓ విమానం రన్‌వేపై నుంచి దూసుకెళ్లి గోడను ఢీకొట్టి కుప్పకూలడంతో ఇప్పటివరకు 28 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం సంభవించిన సమయంలో 175 మంది ప్రయాణికులు, మరో 6 మంది ఫ్లైట్ అటెండెంట్లు విమానంలో ప్రయాణిస్తున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ తెలిపింది. విమానం జెజు ఎయిర్‌కు చెందినది. థాయ్‌లాండ్ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇప్పటివరకు ఒక వ్యక్తి సేఫ్
విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు అది రన్‌వేపై నుంచి దూసుకెళ్లిన క్రమంలో పక్షలు ఢీకొట్టగా పేలిపోయిందని చెబుతున్నారు. వెలుగులోకి వచ్చిన వీడియోలో పేలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో భారీగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. బారికేడ్లను తొలగించి సహాయం చేస్తున్నారు. ఈ రెస్క్యూ కార్యకలాపాల్లో ఇప్పటివరకు ఒక వ్యక్తి సజీవంగా బయటపడ్డాడు.
ప్రమాదానికి కారణమిదేనా..
ఈ ఘటన గురించి ఆరా తీసిన అధికారులు విమానంలో సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక విచారణ ఇంకా కొనసాగుతుందని ప్రకటించారు. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, దక్షిణ కొరియాలో ప్రధానంగా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే విమాన మార్గాలలో ఒకటిగా ఉంది.
ఈ ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడంతో ఈ ప్రమాదం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ప్రమాదానికి గురైన కుటుంబాలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సహాయ బృందాలు వారి పని కొనసాగిస్తున్నారు. ఈ దుర్ఘటన గురించి మరిన్ని పూర్తి వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి.