Sagubadi: ఒక్కసారి నాట్లు…ఆరుసార్లు కోతలు

పెరెన్నియల్‌ రైస్‌


క్కసారి నాట్లేసి మూడేళ్లలో 6 సార్లు కోసుకునే వరిని అభివృద్ధి చేసిన చైనా

తొలి పంట హెక్టారుకు 6.8-7.5 టన్నులు.. తర్వాత 5.4-6.3 టన్నుల ధాన్యం దిగుబడి

మూడేళ్లకు గాను ఉత్పత్తి వ్యయం 29% తగ్గి, నికరాదాయం 235% పెరుగుతుందంటున్న అధ్యయనాలు

17 దేశాలతో పాటు తమిళనాడు, ఒడిశాలో ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం

ఒక్కసారి నాట్లేసి మూడేళ్లలో వరుసగా ఆరు సార్లు పంట కోసుకునే రోజులు రానున్నాయి. ఇలాంటి వరిని ‘పెరెన్నియల్‌ రైస్‌'(పీఆర్‌) అంటున్నారు. ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా ఏడేళ్లుగా సాగు చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు 40% మేరకు తగ్గుతాయి. నికరలాభం పెరుగుతుంది.

పనిలో పనిగా భూసారం, జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. చైనా తదితర దేశాల్లో ఏటేటా పీఆర్‌ వరి సాగు విస్తరిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది. ‘ఫార్మింగ్‌ సిస్టం’ జర్నల్‌ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్‌) శాస్త్రవేత్త డాక్టర్‌ విజయకుమార్‌ షణ్ముగం రాసిన అధ్యయన పత్రం ఆధారంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం

ఖర్చులు పెరిగిపోవటం, ఆదాయం తగ్గిపోవటం, నీటి అవసరాలు పెరగటం, భూసారం క్షీణించటం, హరితగృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగటం.. ఇవీ ప్రస్తుతం మన దేశంలో వరి వ్యవసాయాన్ని వేధిస్తున్న సవాళ్లు. దాదాపు ఈ సమస్యలన్నిటికీ ఏకకాలంలో చెక్‌ పెట్టే అద్భుతమైన ‘పెరెన్నియల్‌ రైస్‌’ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ వరి వంగడాలను చైనాలో రైతులు ఏడేళ్లుగా సాగు చేస్తున్నారు.

సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికి వస్తుంది. తర్వాత సీజన్‌లో మళ్లీ దున్ని, దమ్ము చేసి, నాట్లు వేసుకుంటున్నాం. ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు. మొత్తంగా చూస్తే పీఆర్‌ వరుసగా 6 సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను కోసుకోవచ్చు. పటిష్టంగా ఉండే కుదుళ్లు పంట కోసిన తర్వాత మళ్లీ చిగురించి, పిలకలన్నీ మొదటి పంటలాగే ఏపుగా పెరగటం పీఆర్‌23 వంగడం ప్రత్యేకత. ఒక్కసారి నాట్లు వేస్తే చాలు.. ఇక తర్వాత ప్రతి పంట కాలంలోనూ మళ్లీ మళ్లీ పొలాన్ని దున్ని, నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వరి మొక్కల వేర్లు సాధారణ రకాల (అడుగు) మొక్కల వేర్ల కన్నా బలంగా ఉండి రెట్టింపు (2 అడుగుల) లోతుకు చొచ్చుకెళ్తాయి.

యున్నన్‌ యూనివర్సిటీ ఆవిష్కరణ
చైనాలోని యున్నన్‌ రాష్ట్రంలోని ‘యున్నన్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ (వైఏఏఎస్‌)’ పెరెన్నియల్‌ రైస్‌ వంగడాలను రూపొందించింది. ఒరిజా సటివ అనే సాధారణ వరి రకాన్ని ఒరిజా సాంగిస్తామినట అనే ఆఫ్రికా అటవీ జాతి వరి మొక్కతో ఎంబ్రయో రెస్క్యూ టెక్నిక్‌ను ఉపయోగించి సంకరం చేసి ‘పెరెన్నియల్‌ రైస్‌- పీఆర్‌23’ వంగడాన్ని రూపొదించింది. అధిక దిగుబడి, గింజ నాణ్యత గల పీఆర్‌24, పీఆర్‌25, పీఆర్‌101, పీఆర్‌107 వంగడాలను 2020లో విడుదల చేసింది.

17 దేశాల్లో ప్రయోగాత్మక సాగు
2018 నుంచి దక్షిణ చైనాలో 44,752 మంది చిన్న రైతులు 15,333 హెక్టార్లలో పీఆర్‌ వంగడాలను నీటిపారుదల సదుపాయంతో సాగు చేస్తున్నారు. వీరంతా ఆర్థికంగా, పర్యావరణ పరంగా ప్రయోజనాలు పొందుతున్నారని యున్నన్‌ యూనివర్సిటీ ప్రకటించింది. ఇంటర్నేషనల్‌ పెరెన్నియల్‌ రైస్‌ కొలాబరేషన్‌ తోడ్పాటుతో యున్నన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో సాగవుతున్న పీఆర్‌ వంగడాలు స్థిరంగా మెరుగైన దిగుబడిని ఇస్తు న్నట్లు యున్నన్‌ యూనివర్సిటీ తెలిపింది.

వరి గడ్డితో ఆచ్ఛాదన
కోతల తర్వాత గడ్డిని సాళ్ల మధ్య ఆచ్ఛాదనగా వేస్తున్నారు. దీంతో పోషకాలు పునర్వినియోగమవుతూ భూసారం మెరుగవుతోంది. నేలలో సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం పెరుగుతోంది. కలుపు సమస్య తగ్గుతోంది. రసా యనిక పురుగుమందులు, కలుపుమందుల అవ సరం తగ్గుతున్నది. అవసరం మేరకు ఏడాదంతా కొద్ది కొద్దిగా నీరు ఇచ్చినప్పటికీ, మొత్తంగా సాగు నీటి వాడకం తగ్గుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

29% తగ్గిన ఉత్పత్తి వ్యయం
ప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతిలో కన్నా ఒక్కసారి నాట్లు వేసి మూడేళ్లలో మొత్తం ఆరు పంటలు కోసుకునే ఈ పద్ధతిలో అన్ని ఖర్చులూ కలిపి ఉత్పత్తి వ్యయం 29% తగ్గిందని నాలుగేళ్ల అధ్యయనంలో తేలింది. మొదటి సీజన్‌లో అన్ని ఖర్చులూ మామూలే. రెండో సీజన్‌ నుంచి 54% వరకు కూలి ఖర్చులు ఆదా అవుతాయి. మొత్తం మూడేళ్లలో ఆరు పంట సీజన్లకు గాను.. 5 పంట సీజన్లలో సీజన్‌కు 68-77 పనిదినాల అవసరం తగ్గుతుంది. వాతావరణాన్ని కలుషితం చేసే యంత్రాల వాడకమూ తగ్గుతుంది. పీఆర్‌23 ధాన్యం మిల్లింగ్‌ సామర్థ్యం 73% నమోదైంది. ప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతి కన్నా పీఆర్‌ పద్ధతిలో దిగుబడి 8.8% తక్కువైనప్పటికీ, రైతుకు నికరాదాయం 235% పెరిగిందని అధ్యయన పత్రం తెలిపింది.

మన సగటు దిగుబడి కన్నా ఎక్కువే
ఒకసారి పంట కోసిన తర్వాత తిరిగి పెరగటంలో పీఆర్‌23 వంగడం పనితీరు మెరుగ్గా ఉందని గుర్తించారు. దీని పిలకలు 90-98% తిరిగి పెరిగాయి. అందువల్ల వాణిజ్యపరమైన సాగుకు ఈ వంగడాన్ని ఉపయోగిస్తున్నారు. 119 రోజుల్లో పీఆర్‌23 పంట కోతకు వస్తోంది. తొలి కోతలో హెక్టారుకు 6.8-7.5 టన్నుల ధాన్యం దిగుబడిని ఇస్తుండగా, తర్వాత కోతల్లో 5.4-6.3 టన్నుల వరకు దిగుబడి వస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్‌లో సగటు వరి ధాన్యం దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులు మాత్రమే. కాబట్టి మన రైతులకు ఇది ఉపయోగకరమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముందున్న సవాళ్లు
పీఆర్‌ వరి సాగులో ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశపు వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పీఆర్‌ వరి వంగడాలను రూపొందించుకోవాలి. పంట కోసిన తర్వాత తిరిగి పంట చిగురించటం కోసం నీరు పెడతాం. మొలకలు రాకముందే మోళ్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. మొలకల కన్నా కలుపు వేగంగా పెరిగే అవకాశం ఉంది. గడ్డిని ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వేయటం వల్ల కలుపు కొంత అదుపులో ఉన్నప్పటికీ, కలుపు మందులు వాడక తప్పదు. మోళ్లలో మిగిలిన రోగకారకాలు చీడపీడల బెడదను పెంచవచ్చు. వేసవి అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో పంటను రక్షించుకోవటం అంత తేలిక కాదు. సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం నిధులను విరివిగా వెచ్చించి పరిశోధనలను వేగంగా కొనసాగించాలి. అన్నీ సజావుగా జరిగితే కొద్ది సంవత్సరాల్లో భారతీయ పెరెన్నియల్‌ రైస్‌ వంగడాలు మన రైతులకు అందుబాటులోకి రావచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.