అన్న ఇకపై నువ్వు డైరెక్షన్ చేయకు ప్లీజ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” సినిమా గురించే చర్చ జరుగుతోంది.


పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించడం, అలాగే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో “హరిహర వీరమల్లు”పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆకట్టుకునే ట్రైలర్‌తో ఈ అంచనాలు మరింతగా ఆకాశాన్ని అంటాయి, సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా భావించారు.

అయితే, ఈ అంచనాలను అందుకోవడంలో “హరిహర వీరమల్లు” విఫలమైందనే చెప్పాలి. సినిమాలోని మొదటి భాగం కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ, రెండో భాగం పూర్తిగా అభిమానులను నిరాశపరిచింది. కంటెంట్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ, ప్రధానంగా అత్యంత దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, చిన్న సినిమాల్లో కూడా కనిపించే క్వాలిటీ VFXను కూడా అందించలేకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు.

తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన VFXతో సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో, ఇంతటి భారీ సినిమాకు కనీస స్థాయి నాణ్యత లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సినిమా క్లైమాక్స్ పై వస్తున్న విమర్శలు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించిన చివరి 18 నిమిషాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయని తేలింది.

గతంలో కూడా పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఆయన దర్శకత్వం వహించిన “జానీ” సినిమా ఆయన కెరీర్‌లోనే అతి పెద్ద ఫ్లాప్‌లలో ఒకటిగా నిలిచింది. అలాగే, “సర్దార్ గబ్బర్ సింగ్” చిత్రంలో కూడా కొంత భాగానికి పవనే దర్శకత్వం వహించారనే వార్తలు వచ్చాయి, ఆ సినిమా కూడా నిరాశపరిచింది.

తాజాగా “హరిహర వీరమల్లు” క్లైమాక్స్ బాధ్యతలు కూడా పవన్ కళ్యాణే స్వీకరించారని, అది కూడా అనుకున్న స్థాయిలో లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, పవన్ కళ్యాణ్‌కు దర్శకత్వం కలిసి రావడం లేదని, ఇకమీదట ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టకూడదని అభిమానులు తీవ్రంగా కోరుకుంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.