రైతుల ఖాతాల్లోకి దీపావళి వేళ నిధులు జమ కానున్నాయి. కేంద్రం పీఎం కిసాన్ మలి విడత నిధులను దీపావళి ముందే విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాల్సి ఉంది.
దీని పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా, నిబంధనలు అమలు చేయని వారికి ఈ సారి నిధులు జమ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో.. ముందస్తుగానే రైతులు అర్హుల జాబితాలో తమ పేరు చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పీఎం కిసాన్ లబ్దిదారులకు అధికారులకు కీలక అప్డేట్ ఇచ్చారు. 21వ విడత నిధులను ఈ నెల 18 లేదా 19వ తేదీన రైతుల ఖాతాల్లోకి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం వరద ప్రభావిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యాణా, హిమాచల్ ప్రదేశ్ లో రైతులకు ఆర్దిక సాయం ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాల్లో దీపావళికి ముందే నిధులను విడుదల చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు.
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమల్లో భాగంగా పీఎం కిసాన్ తో పాటుగా నిధుల విడుదల చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్టు 2వ తేదీన పీఎం కిసాన్ తో పాటుగా ఈ ఏడాది తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ అయింది. దీని ద్వారా ఒకే సారి రూ 7 వేలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
అయితే, ఏపీలో పీఎం కిసాన్ కింద అర్హత పొందిన రైతుల సంఖ్య 40.78 లక్షలుగా కాగా, 20వ విడత నిధులు అందిన వారు మాత్రం 40.77 లక్షల మంది. అదే విధంగా తెలంగాణలో అర్హుల సంఖ్య 30.69 లక్షలు ఉండగా.. వారిలో 30.62 లక్షల మందికే నగదు జమ అయింది. అయితే, దీని పైన అధికారులు స్పష్టత ఇచ్చారు. పీఎం కిసాన్ నిధులు జమ కావాలంటే ఇప్పటికే పలు మార్లు ప్రకటించిన విధంగా ఈ -కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.
పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా, పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. ఆధార్- బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోయినా.. బ్యాంకింగ్ వివరాలు సరిగా లేకపోయినా.. నిధుల జమలో సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో.. రైతులు ముందుగానే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లో తమ అర్హత చెక్ చేసకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లో నిధులు జమ అవ్వనున్నట్లు వెల్లడించారు.


































