PoK: పీఓకే విదేశీ భూభాగమే.. కోర్టులో అంగీకరించిన పాకిస్థాన్ గవర్నమెంట్

POK Foreign Territory: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే ) విదేశీ భూభాగం అని పాక్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ దేశ హైకోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. పీఓకేకు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసులో కోర్టుకు ప్రభుత్వం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.


పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగం అని పాకిస్థాన్ అంగీకరించింది. జర్నలిస్ట్ అహ్మద్ కిడ్నాప్ కేసులో కోర్టుకు ఈ అంశాన్ని తెలిపింది. పీఓకేపై పాక్ ప్రభుత్వ పెత్తనం, ఆ దేశ ఆర్మీ మోహరింపుకు వ్యతిరేకంగా అహ్మద్ పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో మే 15న ఆయన ఇంటి వద్ద ధీర్కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే పాకిస్థాన్ ఇంటలీజెన్స్ ఏజెన్సీ తన భర్తను కిడ్నాప్ చేసిందని ఆయన భార్య ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించింది. పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ శనివారం ప్రభుత్వం తరుపున కోర్టులో వాదించారు. పీఓకేలోని పోలీస్ కస్టడీలో అహ్మద్ ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. సొంత రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్న పీఓకే విదేశీ భూభాగం అని చెప్పారు.

దీనిపై పాకిస్తాన్‌కు అధికార పరిధి లేదని అన్నారు. పీఓకేలోని పాకిస్థాన్ కోర్టుల తీర్పును విదేశీ తీర్పుగా పరిగణిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఇస్లామాబాద్ హై కోర్టులో హాజరుపరచలేమని తెలిపారు.పీఓకే కు సంబంధించిన పలు విషయాలపై కోర్టుకు ఆయన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ వాదనలపై ఇస్లామాబాద్ న్యాయమూర్తి మొహ్సిన్ మండిపడ్డారు. పీఓకే విదేశీ భూభాగమైతే పాక్ సైన్యం రేంజర్లు ఆ భూమిలోకి ఎలా ప్రవేశించారని అడిగారు. పాకిస్థాన్ గూడఛార సంస్థలు పీఓకేను బలవంతంగా అపహరించే పద్ధతిని కొనసాగిస్తున్నాయని న్యాయమూర్తి విమర్శిస్తున్నట్లు పాక్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.