Polavaram: కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికే నిర్ణయం

పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా స్పష్టం చేశారు.


అమరావతి: పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ ఓహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. కొత్త డయాఫ్రం వాల్‌ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు ఎంత దూరంలో కట్టాలి? ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కోరారు. పోలవరం ప్రాజెక్టులో నాలుగు రోజులుగా పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు కుష్విందర్‌ ఓహ్రా బుధవారం దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్‌ పాల్, రిచర్డ్‌ డొన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌ బెర్గర్, రాష్ట్ర ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్, కేంద్ర జలసంఘం డిజైన్ల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌ శరణ్, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వనీకుమార్, గౌరవ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.

నిపుణుల నివేదిక ఆధారంగానే..
కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్, విదేశీ నిపుణులు ఛైర్మన్‌ ఓహ్రాకు ఇప్పటికే ఒక నివేదిక పంపారు. నాలుగు రోజులుగా ఏమేం పరిశీలించారు, ఏమేం చర్చలు జరిగాయి, వాటి సారాంశం ఏంటనే అంశాలను అందులో నివేదించారు. ఆ నివేదిక ఆధారంగానే కుష్విందర్‌ ఓహ్రా సమావేశం నిర్వహించారు. విదేశీ నిపుణులు నలుగురు తమ అభిప్రాయాలు తెలియజేశారు. కేవలం ఇక్కడ చూసిన అంశాలు, ఇక్కడి వారి అభిప్రాయాలు, చర్చల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయాలకు రాలేమని వారు పేర్కొన్నారు. ఉన్న నివేదికలను అధ్యయనం చేసేందుకు తగినంత సమయం దొరకలేదని.. వాటన్నింటినీ అధ్యయనం చేసి రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని ఓహ్రాకు చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక రచించుకోవాలని ఛైర్మన్‌ వెల్లడించారు. ఆ నివేదికలను ఆధారంగా తీసుకుని ఇప్పటికే అంతర్జాతీయ డిజైన్‌ నిపుణులు ఆఫ్రి పోలవరంలో పని చేస్తున్నారు. వారు డిజైన్లు రూపొందిస్తారు. వాటిని విదేశీ నిపుణులకు పంపి, ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత కేంద్ర జలసంఘానికి సమర్పించి, డిజైన్లకు ఆమోదం తీసుకుని పనులు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ నిపుణుల సమీక్షలో పాల్గొన్న మంత్రి రామానాయుడు

ఎగువ కాఫర్‌ డ్యాం గట్టిగా ఉన్నా సీపేజీ తప్పదేమో!
విదేశీ నిపుణులు మాట్లాడుతూ ఎగువ కాఫర్‌ డ్యాంలో నిర్మాణపరంగా ఎలాంటి భద్రతా లోపాలూ కనిపించడం లేదని పేర్కొన్నారు. సీపేజీ విషయంలో ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు మార్గాలు ఉన్నాయేమో చూస్తామన్నారు. కానిపక్షంలో సీపేజీని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ నిర్మాణం కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇది కేవలం తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతం అక్కడ నాలుగు బోరు గుంతలు (బోర్‌ హోల్స్‌) తవ్వించి, తాము చెప్పిన పద్ధతిలో సమాచారం సేకరించాలన్నారు. ప్రస్తుతం రెండు బోరు గుంతల సమాచారం మాత్రమే వచ్చింది. మొత్తం 18 బోర్‌ హోల్స్‌ తవ్వి సమాచారం సేకరించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది. అయితే ఇందుకు సమయం పడుతుందని, ఈలోపు కొంత సమాచారం వచ్చినా తమ అభిప్రాయం తెలియజేస్తామని నిపుణులు వివరించారు. కట్టడం నుంచి మాత్రమే సీపేజీ ఉంటే ఒకరకంగా ఉంటుందని, దిగువన ఉన్న కటాఫ్‌ నుంచి కూడా సీపేజీ వస్తుంటే మరో తరహాలో ఉంటుందని పేర్కొన్నారు. మధ్యంతర నివేదికలో దీనిపై స్పష్టమైన అభిప్రాయం తెలియజేస్తామని నిపుణులు వెల్లడించారు. వైబ్రో కాంపాక్షన్‌ పనులకు సంబంధించి కొన్నిచోట్ల ఒక స్థాయికి మించి దిగువకు ఇసుకను నింపలేకపోవడం, సాంద్రత పెంచలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అది పర్వాలేదని వారు అభిప్రాయపడ్డారు. కొన్ని మార్పులు సూచిస్తామన్నారు. పోలవరం వద్ద గోదావరిలో బంకమట్టి ఉన్నందున కట్టడాల నిర్మాణంలో స్టోన్‌ కాలమ్‌ల నిర్మాణం తదితర అంశాలపైనా మాట్లాడారు. బంకమట్టి పరిస్థితులున్నా నిర్మాణాలు చేపట్టవచ్చని భరోసా ఇచ్చారు. మొత్తం మీద విదేశీ నిపుణుల రాకతో పోలవరంలో ఒక భరోసా, సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.