పోలీసు సిబ్బందికి విధులు నిరంతరాయంగా ఉండేవే. వాళ్లకు సెలవులు, విశ్రాంతి, వీకాఫ్‌లు అనే వాటిపై చర్చ కూడా నిరంతరం జరిగేదే. ప్రభుత్వాలు ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన దాఖలాలు అరుదనే చెప్పాలి.
అయితే.. ఇక్కడ ఓ రాష్ట్రంలో పోలీసులకు ఇక నుంచి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
పోలీసులకు వాళ్ల, వాళ్ల కుటుంబ సభ్యుల పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం తదితర రోజుల్లో సెలవు తీసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. నిరంతరం విధుల్లో ఉంటూ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని ఈ వెసులుబాటు ఇచ్చింది. దీనివల్ల వారిపై పనిభారం, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాల కోసం పోలీసు సిబ్బంది సెలవు కోరితే తప్పకుండా మంజూరు చేయాలని డీజీపీ డాక్టర్ సలీం గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రత్యేక లీవ్ పాలసీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించబడిన ఉదాహరణలు లేవు. కాబట్టి.. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల రోజున పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం(కాజ్యువల్ లీవ్) అనే విధానం కర్ణాటకలోనే మొదటిసారి అమలులోకి వచ్చింది.
పోలీస్ సేవ చాలా కఠినమైనది, కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమవుతోంది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి వ్యక్తిగత సందర్భాల్లో సెలవు ఇవ్వడం ద్వారా సిబ్బంది భావోద్వేగపరంగా రీఛార్జ్ అవ్వగలరు. కుటుంబంతో కొంత సమయం గడపగలరు. ఇది మానసిక ఒత్తిడి తగ్గించడంలో, ఉత్సాహాన్ని పెంచడంలో, ఉద్యోగ సంతృప్తి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని యూనిట్ హెడ్‌లు ఈ ఆదేశాన్ని అమలు చేసి, సిబ్బంది కోరినప్పుడు సెలవు ఇవ్వాలని కర్ణాటక డీజీపీ ఆదేశించారు. ఈ చర్యను మానవీయమైన నిర్ణయంగా వర్ణిస్తూ.. పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తించడం, విశ్వాసాన్ని పెంపొందించడం, శాఖ పట్ల నిబద్ధతను బలపరచడం లక్ష్యంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


































