Andhra Pradesh Assembly Elections 2024 : ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ షురూ… ఇంటి నుండే ఎలా ఓటేయాలి..?

www.mannamweb.com


ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ప్రక్రియ ప్రారంభమయ్యింది. మే 13న జరిగే పోలింగ్ కంటే ముందే కొందరు సామాన్య ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అది ఎలాగంటే…

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసి ప్రధానపార్టీల ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగో విడతలో వున్నాయి… అంటే మే 13న పోలింగ్ జరగనుంది. కానీ ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమైనట్లు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

85 ఏళ్లు పైబడిన వృద్దులతో పాటు పోలింగ్ కేంద్రాలకు రాలేని వికలాంగులకు ఇంటివద్దే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమీషన్ కల్పించింది. ఈ ఆప్షన్ ను ఎంచుకున్నవారికి పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఎన్నికల అధికారులు వృద్దులు, వికలాంగుల ఇంటివద్దకే వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందిస్తున్నారు. వారు తమకు ఇష్టమైన పార్టీ, అభ్యర్థికి ఓటేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారు. ఇలా హోం ఓటింగ్ కోరుకున్నవారిలో కొందరు ఇప్పటికే ఓటుహక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా హోం ఓటింగ్ కు అర్హత కలిగినవారు 7,28,484 మంది వున్నట్లు ఈసీ వెల్లడించింది. వీరిలో 2,11,257 మంది 85 ఏళ్ళు పైబడిన వృద్దులలు, 5,17,227 మంది వికలాంగులు వున్నారు. అయితే కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ఇష్టపడుతున్నారని… మిగతావారు పోలింగ్ రోజే ఓటుహక్కను వినియోగించుకోనున్నారు. హూం ఓటింగ్ ఎంచుకున్నవారిలో వృద్దులు 14,577 మంది, వికలాంగులు 14,014 మంది వున్నారు.

హోం ఓటింగ్ ఎలా ఉపయోగించుకోవాలి :

పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయలేని వృద్దులు, వికలాంగులు ముందుగానే ఎన్నికల అధికారులకు హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వీస్ ఓటర్ల మాదిరిగానే వీరు కూడా 12D ఫారం సమర్పించాల్సి వుంటుంది. ఇలా హోం ఓటింగ్ కు అప్లై చేసుకున్నవారి ఇంటివద్దకే వచ్చి ఓటు వేయిస్తారు ఎన్నికల అధికారులు.

హోం ఓటింగ్ కోసం ఇంటికి వెళ్ళేముందు సదరు ఓటరుకు అధికారులు సమాచారం ఇస్తారు. ఒకవేళ ఓటరు అందుబాటులో లేకుంటే మరో రోజు అవకాశం కల్పిస్తారు. ఓటరు అందుబాటులో వుంటే బ్యాలట్ బాక్సుతో సహా ఇంటికి వస్తారు. బ్యాలట్ పేపర్ ఇచ్చి రహస్యంగా ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఓటరే స్వయంగా బ్యాలట్ బాక్సులో తమ పత్రాన్ని వేస్తారు.

హోం ఓటింగ్ కోసం వచ్చేవారిలో గెజిటెడ్ ఆఫీసర్, అసిస్టెంట్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది వుంటారు. ప్రతి 50 నుండి 100 మంది ఓటర్లకు ఓ టీం వుంటుంది… వీరు ఇంటికి వెళ్లి ఓట్లను కలెక్ట్ చేస్తారు. కౌంటింగ్ రోజు సాధారణ ఓట్లతో పాటే ఈ హోం ఓటింగ్ ఓట్లను కూడా లెక్కిస్తారు.