AP Polling : ఏపీలో సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని సీఈవో ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
AP Polling : ఏపీలో కొన్ని నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం ముగియగా, మరో 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో పోలింగ్ సమయాలపై ఈసీ ప్రకటన చేశింది. ఏపీలోని 6 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు అయిన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఈసీ ప్రకటించింది.
సాయంత్రం 6 తర్వాత మైకులు బంద్
ఇవాళ సాయంత్రం 6 గంటలకు తర్వాత అన్ని రకాల ప్రచారాలు నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తోందన్నారు. బయటి ప్రాంతాల వాళ్లు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మాత్రం బయటి వారికి అనుమతిస్తామన్నారు. ఆదివారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ లకు చేరుకుంటామని ఎంకే మీనా తెలిపారు. సోమవారం ఉదయం పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అరకు, పాడేరు, రంపచోడవరం, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసిందని సీఈవో మీనా తెలిపారు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం చేయకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
46 వేల పోలింగ్ కేంద్రాలు
“పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నాం. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం. ఒపీనియన్ పోల్, ఎగ్జీట్ పోల్స్ పైనా నిషేధం ఉంది. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సెలవు ఇవ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశాం. అలాగే ప్రైవేటు , ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. 1.60 లక్షల ఈవీఏంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నాం. ఎన్నికల రోజు హింస జరక్కుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవరిస్తాం. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయడం లేదు. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదు. తిరుపతి తరహా ఘటనలు జరక్కుండా నియంత్రిస్తున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్దులకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది. ఈసారి 83 శాతం మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం”- సీఈవో ముకేష్ కుమార్ మీనా