ఆధునిక సాంకేతికత వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఒకప్పుడు కొన్ని అంశాలకు, కొన్ని రంగాలకే పరిమితమైన టెక్నాలజీని ఇప్పుడు మానవుడి ప్రతీ అవసరాన్ని తీర్చేలా సాంకేతిక నిపుణులు రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.
సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. రీసెంట్‌గా ఒక జర్మన్ స్టార్టప్ కూడా అదే చేసింది. మరో కొత్త సాంకేతిక సౌకర్యంతో ముందుకొచ్చింది. మనిషి తన అవసరం కోసం ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే, ఏ ప్రాంతంలోనైనా దానిని ఉపయోగించుకోగలిగే విధంగా ఒక చిన్నపాటి ‘పోర్టబుల్ షెల్టర్’ను డెవలప్ చేసింది. ముఖ్యంగా హోమ్‌లెస్ పీపుల్‌కు, నిరాశ్రయులైన వారికి తలదాచుకోవడంలో, అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇది ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతకీ దాని ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా డెవలప్ చేసిన పోర్టబుల్ షెల్టర్ పర్యాటకులకు, సొంత నివాసం లేని నిరాశ్రయులకు, కఠినమైన వాతావరణాల్లో నీడనిస్తుందని, వెచ్చదనాన్ని, భద్రతను కల్పిస్తుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీని తయారీ విధానమే అలాంటిది. పైగా ఇది లైట్‌వెయిట్, అలాగే ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి, బిల్ట్ – ఇన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అంతేకాకుండా వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఇలా అన్ని సీజన్లలోనూ అనువుగా ఉండేలా దీనిని ఫైర్ – రెసిస్టెంట్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. రోజువారీ అవసరాలకోసం ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు. రాత్రి పూట త్వరగా సెటప్ చేసి, భద్రంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ముఖ్యంగా దీని డిజైన్ కూడా మొబైల్ చార్జింగ్, లైటింగ్ వంటి సౌకర్యాలను కలిగి ఉండి, వినియోగదారులను కనెక్టెడ్ అండ్ ఇండిపెండెంట్ (Connected and independent)గా ఉంచడంలో సహాయపడుతుంది. పర్యావరణ పరిరక్షణలోనూ పోర్టబుల్ షెల్టర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిని సస్టైనబుల్ స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించారు.

































