సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు, హైద్రాబాద్‌లోని పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్ళి, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
అంతకు ముందు, సంబంధిత పీఎస్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు, అరెస్టు విషయమై సమాచారమిచ్చారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో పోసాని కృష్ణమురళికి వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతగా వున్న సమయంలో, పోసాని కృష్ణమురళి కన్నూ మిన్నూ కానకుండా అత్యంత అసభ్యకరమైన రీతిలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసిన విషయం విదితమే.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా పోసాని కృష్ణమురళి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
మరీ ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా.. అందునా, పవన్ కళ్యాణ్ కూతుళ్ళపైనా, పోసాని కృష్ణ మురళి నోరు పారేసుకున్నారు. ‘పవన్ కళ్యాణ్.. నీకూ కూతుళ్ళున్నారు.. వాళ్ళు పెద్దవాళ్ళవుతారు.. నేను అప్పటికి బతికే వుంటా..’ అంటూ అత్యంత అసభ్యకరమైన రీతిలో బెదిరింపులకు దిగారు. అది కూడా హైద్రాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి మరీ.
ఇలా, పోసాని నోటి దురుసు అత్యంత హేయంగా మారిన దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్‌తోపాటు, తెలంగాణలోనూ పోసాని కృష్ణ మురళిపై చాలా కేసులు నమోదయ్యాయి. అయితే, అప్పట్లో వైసీపీ సర్కారు, ఆ కేసుల్ని తొక్కి పెట్టింది.
కూటమి అధికారంలోకి వచ్చాక, అందిన మరిన్ని ఫిర్యాదుల నేపథ్యంలో, పోసాని కృష్ణ మురళిపై బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా, హైద్రాబాద్‌లో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయన్ని ఓబులవారిపల్లెకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలో వున్నప్పుడు, ఒళ్ళు తెలియకుండా వ్యవహరించిన చాలామంది వైసీపీ నాయకులు ఇప్పుడు ఒకరొకరుగా జైలు బాట పడుతున్నారు. ఇంట్లో వాళ్ళు సైతం అసహ్యించుకునేలా వైసీపీ నేతల తీరు వుండేది అప్పట్లో. అధికార మదం వైసీపీ నేతలతో అలా మాట్లాడించింది.
ఇదిలా వుంటే, కూటమి అధికారంలోకి వచ్చాక, రాజకీయ సన్యాసం ప్రకటించారు పోసాని కృష్ణ మురళి. ఇకపై ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడనంటూ మీడియా ముందు చెప్పారు, కానీ, గతంలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించి తీరాలి కదా.!
అన్నట్టు, తిరుమలపైనా, టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు మీద కూడా పోసాని అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నమోదైన కేసుల సంఖ్య చాలా పెద్దదే కావడంతో, పోసాని కృష్ణ మురళికి చట్టపరమైన చిక్కులు తీవ్రస్థాయిలో వుండబోతున్నాయి. చేసిన పాపాలు అలాంటివి మరి.!
‘ఇలాంటోడు సభ్య సమాజంలో తిరగడానికి వీల్లేదు. వీడి వల్ల ఆడ పిల్లలకు రక్షణ వుండదు’ అంటూ జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోసాని అరెస్టుపై స్పందిస్తున్నారు.