సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (posani krishna murali) సంచలన ప్రకటన చేశారు. జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై వైకాపా నేతగా ఉన్న పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఏపీలో పలు పోలీస్‌స్టేషన్‌లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే గాక, తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని తెదేపా నాయకులు ఆరోపించారు. పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేయడం గమనార్హం.
”నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్న సమయంలో అందరినీ విమర్శిస్తుంటానని అనుకుంటారు. నేను రాజకీయ పార్టీ నాయకుల నీతి, నిజాయతీలు, నడవడికను బట్టి కామెంట్స్ చేస్తా తప్ప, మంచి నాయకుడిని విమర్శించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన జీవితంలో అవినీతి లేదు. ఎప్పుడూ నిజాయతీగా మాట్లాడతారు. ఆయన మంత్రి స్థాయి నుంచి ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. ఆయన రూ.కోట్ల ఆస్తులు కూడగట్టారని ఇన్నేళ్ల కాలంలో ఎవరైనా అన్నారా? ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి విమర్శలు చేయలేదు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్.. ఇలా ఎవరినీ నేను విమర్శించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్, రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీఆర్ ఇలా అందరినీ వారి గుణగణాలను సపోర్ట్ చేశా. తప్పులు చేసిన ప్రతి ఒక్కరినీ విమర్శించా”
”1983 నుంచి రాజకీయాలపై మాట్లాడుతున్నా. ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మరో పార్టీని తిట్టను. ఆ పార్టీల్లో ఉన్న వాళ్లు తప్పు చేస్తేనే తిట్టాను. ఇక నుంచి నా జీవితకాలం నేను రాజకీయాలు మాట్లాడను, వాటి ప్రస్తావన తీసుకురాను. ఏ పార్టీనీ పొగడను, మద్దతు తెలపను.. విమర్శించను. నేను ఇలా మాట్లాడటానికి కారణం నాపై కేసు పెడుతున్నారని కాదు. 16ఏళ్ల పిల్లల నుంచి 70ఏళ్ల వృద్ధురాలి వరకూ అసభ్య పదజాలంతో తిడుతున్నారు. ఇప్పటికీ నాకు నచ్చిందే చేస్తా. ఏ పార్టీని పదవి కావాలని అడగలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని అన్నారు. వద్దని చెప్పాను. నేను ఎక్కువగా పొగిడింది నారా చంద్రబాబునాయుడిగారినే. అది ఆయన్నే అడగండి. ఆయన ఓడిపోయిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కలిశాను. అప్పుడు ‘శ్రావణమాసం’ మూవీ సమయంలో ఆయనకు 100 అడుగుల కటౌట్ కట్టించా. ఆయన చేత్తో రిబ్బన్ కట్ చేయించా. నన్ను, నా కుమారులను దీవించారు. అప్పట్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని తీసుకురాలేదు. ఆ విషయం తెదేపా వాళ్లకు తెలుసు. ఆయన చేసిన మంచి పనులపై పేపర్‌లో రాశా. ఆయన తప్పులను విమర్శించా. అప్పుడు తంటా వచ్చింది” అని పోసాని అన్నారు.