పీపీఎఫ్ (PPF)లో ఒక సంవత్సరంలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం రూ.500, గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమచేయవచ్చు.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF) పన్ను ప్రయోజనాలను అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎంతో ప్రాధాన్యం పొందింది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మినహాయింపు అందిస్తుంది. దీర్ఘకాలం పాటు పొదుపు చేయాలనుకునే వారికి మంచి ఎంపిక.
వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తాలపై రెండింటికీ పన్ను వర్తించదు. ఒక వ్యక్తి తన పిల్లల పేర్లపై, మైనర్ సంరక్షకుని (Guardian)గా పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు.
అయితే జాయింట్ ఖాతాను తెరవడం సాధ్యం కాదు. మైనర్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అతడు/ఆమె ఖాతాను స్వయంగా నిర్వహించుకోవచ్చు. మైనర్ ఖాతాలపై రుణాలు, పాక్షిక విత్డ్రా (Partial Withdrawal) వంటివి కూడా అనుమతిస్తారు.
మైనర్ పేరుపై PPF ఖాతా: 10 ముఖ్య విషయాలు
- ఒక వ్యక్తి తన పేరుపై గానీ, మైనర్ తరఫున సంరక్షకుడిగా గానీ PPF ఖాతాను తెరవొచ్చు. రూ.500తో ఖాతాను తెరవడానికి వీలుంది.
- ఒక సంవత్సరంలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం రూ.500. గరిష్ఠంగా, వార్షికంగా రూ.1.5 లక్షల వరకు జమచేయవచ్చు.
- తల్లి/తండ్రి/గార్డియన్ వారి పేరుపై ఇదివరకే PPF ఖాతా ఉంటే, పిల్లల పేరుతో తెరిచే ఖాతా, మునుపటి ఖాతాలో కలిపి ఒక సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే జమచేసేందుకు వీలుంటుంది.
- తల్లి/తండ్రి/గార్డియన్ వారి ఆదాయం నుంచి మైనర్ పేరుపై ఉన్న PPF ఖాతాలో పెట్టుబడి పెడితే సెక్షన్ 80C ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.
- మైనర్‌కు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, మైనర్ నుంచి మేజర్‌కు స్టేటస్ మార్చేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వారు స్వయంగా ఖాతాను నిర్వహించేందుకు వీలుంటుంది.
- అవసరమైన పత్రాలతో పాటు డిపాజిటర్ స్వయంగా సవరించిన దరఖాస్తును ఇవ్వాలి. ఈ ఫారమ్‌లో మేజర్ అయిన డిపాజిటర్ సంతకం, ఖాతా తెరిచిన సంరక్షకుడు ద్రువీకరించాలి.
- డిపాజిటర్ PPF ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 7వ సంవత్సరంలో పాక్షిక విత్డ్రా (Partial Withdrawal) చేసుకోవచ్చు. మైనర్ ఖాతా నుంచి విత్డ్రా చేయాలంటే, ఆ మొత్తాన్ని మైనర్ కోసం వినియోగిస్తున్నట్లుగా సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వాలి.
- కొన్ని నిర్దిష్ట సందర్భాల్లో డిపాజిటర్ (సంరక్షకుడు) PPF ఖాతాను మూసివేసేందుకు ప్రయత్నించవచ్చు.
- ఖాతాదారుని వైద్య చికిత్సల కోసం, ఖాతా ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ళు పూర్తయిన తర్వాత PPF మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇందుకు వైద్య నివేదికలు, నిపుణ వైద్యుని లెటర్ తీసుకుని రావాల్సి ఉంటుంది.
- మైనర్ ఖాతాదారుడి ఉన్నత విద్యకు PPF మొత్తం అవసరమైతే, ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 5 సంవత్సరాల తర్వాత ఖాతాను పూర్తిగా క్లోజ్ చేసుకునే వీలు ఉంది.
- మైనర్ PPF ఖాతాపై గార్డియన్ లోన్ (Loan) తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ లోన్ మొత్తం మైనర్ సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నట్లు గార్డియన్ డిక్లరేషన్ ఇవ్వాలి.