Tirumala: కొండపై కోడిపుంజుల ప్రభాకర్‌! క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం

టీటీ ప్రభాకర్‌బాబు.. ఏపీ పోలీసు శాఖలో ప్రస్తుతం అదనపు ఎస్పీ హోదాలో పని చేస్తున్నారు. వైకాపా హయాంలో 2019 ఆగస్టు 10 నుంచి 2020 నవంబరు 30 వరకు తిరుమల డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన నిర్వాకంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. శుక్రవారం అభియోగాలు మోపింది. ‘తితిదే కేటాయించిన వసతిగృహంలో నివసించిన ప్రభాకర్‌బాబు.. అందులో కోడిపుంజులు పెంచారు. ఆ వసతిగృహం భక్తులు, యాత్రికులకు కేటాయించిన కాటేజీల మధ్యలో ఉండటంతో రాత్రివేళ ఆ కోళ్ల అరుపుల శబ్దాలు, వాటి విసర్జితాల దుర్వాసనకు యాత్రికులకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఆ కోళ్లకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం, వంటి పనులు కానిస్టేబుళ్లతో చేయించేవారు. ప్రభాకర్‌బాబు ప్రవర్తనతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసు సిబ్బంది.. తాము అక్కడ పని చేయలేమని వేరే చోటకు పంపించాలని అభ్యర్థించగా.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు’ అనేది అభియోగాల సారాంశం. ప్రభాకర్‌బాబుపై 7 అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం.. వాటన్నింటికీ 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా హాజరై సమాధానాలివ్వాలని ఆదేశించింది. గడువులోగా సమాధానాలివ్వకపోతే తమ వద్దనున్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులిచ్చారు.


ప్రధాన అభియోగాలివే..
ప్రభాకర్‌బాబు నివాసానికి పాలు పోసే వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు ఇవ్వకపోవడంతో అతను పాల ప్యాకెట్లు వేయడం ఆపేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్‌బాబు.. అతన్ని వరాహస్వామి గెస్ట్‌ హౌస్‌ వద్దకు రప్పించి, అతని వాహనంపై రూ.2 వేల జరిమానా వేయించారు.

ప్రభాకర్‌బాబు వాహన డ్రైవర్‌గా పనిచేసే హోంగార్డును ఒక రోజంతా అవిశ్రాంతంగా తిప్పించారు. దీనివల్ల వాహనం వేడెక్కి ప్రమాదానికి గురైంది. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆ హోంగార్డుపై కేసు పెట్టించారు.
తిరుమల ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే తితిదే ఉద్యోగులు, ఇతరులను కలిపి 40 మందిని నిందితులుగా చేర్చారు. అందులో డిప్యూటీ ఈవో కూడా ఉన్నారు. వారెవరినీ విచారించలేదు.