లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన.. కేసు విచారణకు సహకరిస్తానని, శుక్రవారం (మే 31న) ‘సిట్’ ముందు వ్యక్తిగతంగా హాజరవుతానంటూ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాపై తప్పుడు కేసులు బనాయించారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమే. ఇప్పటికే కుంగుబాటుకు లోనయ్యాను. అయితే, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది’’ అని తెలిపారు.
తన ఆచూకీ చెప్పనందుకు.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జేడీఎస్ శ్రేణులకు ప్రజ్వల్ క్షమాపణలు చెప్పారు. ‘‘విదేశాల్లో ఎక్కడున్నానో సరైన సమాచారం ఇవ్వనందుకు కుటుంబసభ్యులకు, కుమారస్వామికి, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నా. ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసినప్పుడు నాపై ఎటువంటి కేసు లేదు. ఆ తర్వాత రెండు, మూడు రోజులకు ఆరోపణలు వెల్లువెత్తినట్లు చూశాను’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులూ తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగంగా మాట్లాడారని, ఇది రాజకీయ కుట్రేనని ఆరోపించారు.
ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నుంచి పోటీ చేసిన ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడమే గాక.. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే.. ఏప్రిల్ 27నే ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీ వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.
పరారై.. నెల రోజులు..!
ప్రజ్వల్ విదేశాలకు పరారై నెల రోజులైనా.. ఇప్పటివరకు ఆయన ఆచూకీని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించలేకపోయింది. నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ బహిరంగ విన్నపాలు చేసుకున్నా అటునుంచి స్పందన లభించలేదు. సరిగ్గా నెల రోజులకు ప్రజ్వల్ ఈమేరకు స్పందించారు.