బెంగళూరు: దేశవ్యాప్తంగా కలకలం రేపిన హాసన అశ్లీల వీడియో, కిడ్నాప్ కేసుల్లో (Sex Crimes Case) సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మహిళలపై లైంగిక దౌర్జన్యం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ (Bhavani Revanna)పైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్ (Kidnap) ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను విచారించేందుకు సిట్ (SIT) అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. శనివారం ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని అందులో పేర్కొన్నారు. నేడు ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే నేటి ఉదయం సిట్ అధికారులు హొళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా భవానీ అక్కడ కన్పించలేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది.
కర్ణాటక (Karnataka News) హాసనలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన మరుసటిరోజే ఈ అశ్లీల వీడియోల వ్యవహారం బయటికొచ్చింది. అప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ (JDS MP Prajwal Revanna) విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన తండ్రి రేవణ్ణపైనా ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో ప్రజ్వల్ లొంగిపోవాలని ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ సహా కుటుంబసభ్యులు హెచ్చరించారు.
ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు చేరిన హాసన (Hassan) ఎంపీని అధికారులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 6 వరకు సిట్ కస్టడీకి అప్పగించారు.