కరోనా మహమ్మారి తర్వాత భారతీయులలో జీవిత బీమా (Life Insurance), ఆరోగ్య బీమా (Health Insurance) పట్ల అవగాహన గణనీయంగా పెరిగింది.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైనా, ప్రమాదం జరిగినా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, అధిక ప్రీమియంల కారణంగా చాలా మంది బీమా తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా అత్యంత తక్కువ ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చింది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా ఈ ప్రమాద బీమా పథకాలను ప్రారంభించాయి. 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పాలసీలను దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా పొందవచ్చు. రూ.555, రూ.755 ప్రీమియం ప్లాన్లు తక్కువ ఖర్చుతో అధిక బీమా కవరేజీని అందిస్తున్నాయి. ఇందులో భాగంగా హెల్త్ ప్లస్ (ఆప్షన్ 1) కింద సంవత్సరానికి రూ.355 ప్రీమియంతో రూ.5 లక్షల బీమా పొందవచ్చు. ఈ స్కింలో భాగంగా.. పాలసీకి తీసుకున్న వ్యక్తికి ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగి ఎముక విరిగితే రూ.25,000 లభిస్తుంది. అలాగే హెల్త్ ప్లస్ (ఆప్షన్ 2) ద్వారా రూ.555 ప్రీమియంతో రూ.10 లక్షల బీమా, పిల్లల చదువుకు రూ.50,000, దహన ఖర్చులకు రూ.5,000 అందుతాయి. ఇంకా హెల్త్ ప్లస్ (ఆప్షన్ 3) కింద రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షల బీమా, పిల్లల వివాహానికి రూ.1 లక్ష, ఎముక విరిగితే రూ.25,000 లభిస్తాయి. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత అంగవైకల్యం కలిగితే బీమా మొత్తాన్ని 100% కుటుంబానికి చెల్లిస్తారు.
రూ.755 ప్లాన్ కింద పాలసీదారు మరణిస్తే నామినీకి రూ.15 లక్షలు పిల్లల చదువుకు, వివాహానికి రూ.1 లక్ష చొప్పున లభిస్తాయి. వైద్య ఖర్చులకు రూ.1 లక్ష వరకు, రోజుకు రూ.1,000 (ఐసీయూలో రూ.2,000) చెల్లింపు ఉంటుంది. అలాగే రూ.399 ప్లాన్ ద్వారా రూ.10 లక్షల బీమా, బ్రెయిన్ స్ట్రోక్ లేదా అంగవైకల్యం ఏర్పడినా పూర్తి మొత్తం లభిస్తుంది. ఆసుపత్రి చికిత్సకు రూ.60,000 వరకు క్లెయిమ్ చేయవచ్చు. రూ.299 ప్లాన్ కూడా రూ.10 లక్షల ప్రమాద బీమాను అందిస్తుంది. అయితే దీనికి అదనపు ప్రయోజనాలు లభించవు. ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లాన్ కింద పాలసీదారులు రిమోట్ కన్సల్టేషన్‌లు, వార్షిక ఆరోగ్య తనిఖీ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బీమా పాలసీలను పొందాలంటే తప్పనిసరిగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి. తక్కువ ప్రీమియంతో భద్రత కోరుకునే వారికి పోస్టల్ శాఖ అందిస్తున్న ఈ పథకాలు ఒక మంచి ఆర్థిక రక్షణగా నిలువనున్నాయి.



































