రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది.
అమరావతి: రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. జంషెడ్‌పుర్ ప్రధాన కేంద్రంగా నడిచే ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ.. భారత్‌లో ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటి. గత తెదేపా హయాంలో తుళ్లూరు మండలం ఐనవోలులో ఈ సంస్థకు 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. 2018 జూన్‌లో ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో జగన్ సర్కారు దెబ్బకు ఈ విద్యా సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. తాజాగా మళ్లీ చంద్రబాబు సర్కారు కొలువుదీరడంతో తమ ప్రాంగణాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ముందుకొచ్చింది. రూ.250 కోట్లతో అమరావతిలో అతిపెద్ద ప్రాంగణాన్ని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ నిర్మించబోతోంది. నిర్మాణం పూర్తయితే ఈ ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్ స్కూల్ ప్రాంగణంలో 5వేల మందికి పైగా రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులు చదివేందుకు వెసులుబాటు కలుగుతుంది.
ఒక్కొక్కటిగా తరలివస్తున్న ప్రముఖ సంస్థలు..
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా రావడంతో అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో భూములు కేటాయించినా కార్యకలాపాలు ప్రారంభించని దిగ్గజ సంస్థలతో ప్రస్తుతం మళ్లీ జరుపుతున్న సంప్రదింపులు ఫలిస్తున్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా చంద్రబాబు సూచనలతో సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో మళ్లీ దిగ్గజ సంస్థలతో చర్చలు ఆరంభించారు. అమరావతిలో కార్యకలాపాలను ప్రారంభించాలని ఆహ్వానిస్తున్నారు.