విచారణకు రండి.. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌కు రాచకొండ సీపీ నోటీసులు

www.mannamweb.com


జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మంచు మోహన్‌బాబు(Mohanbabu), విష్ణు, మనోజ్‌(Manchu Manoj)కు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు.

అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ హోదాలో సీపీ ఈ నోటీసులు జారీ చేశారు. సీపీ ఆదేశాలతో ఇప్పటికే పోలీసులు మంచు విష్ణు, మోహన్‌బాబు వద్ద ఉన్న లైసెన్స్‌ గన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే?

జల్‌పల్లిలో సినీనటుడు మోహన్‌బాబు (Mohan Babu) నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్‌ దంపతులు మోహన్‌బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో.. ‘నా కుమార్తె లోపల ఉంది’ అంటూ మనోజ్‌ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్‌ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్‌ బయటకు వచ్చారు. మరోవైపు, ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్‌బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ప్రతినిధులపై ఆయన చేయి చేసుకున్నారు. మోహన్‌బాబు బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్‌ కిందపడ్డారు. విలేకరులను బయటకు నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు.