ఇంటర్మీడియట్‌ అర్హతతో రైల్వే జాబ్.. ఇలా సాధించవచ్చు

1853, ఏప్రిల్ 16..


ప్రయాణికుల రైలు దేశంలో తొలిసారిగా నడిచిన రోజు.

ఇప్పటికి 172 ఏళ్లకు పైగా భారతీయ రైల్వే విజయవంతంగా సేవలందిస్తోంది.

ప్రతిరోజూ సగటున దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది.

అయితే, ఇప్పుడు చర్చ ప్రయాణికుల కోసం కాదు, ఉద్యోగాల కోసం.

‘లైఫ్‌లైన్ టు ది నేషన్’… ఇదీ భారతీయ రైల్వే ట్యాగ్‌లైన్.

ఇప్పుడు ఇదొక ‘జాబ్ లైన్’ అని కూడా పిలవవచ్చు. ఎందుకంటే, దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థగా భారతీయ రైల్వే వ్యవస్థ ముందుంది.

సంఖ్యాపరంగా చెప్పాలంటే, రైల్వేలో దాదాపు 12 లక్షల మంది పనిచేస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులు కలిగిన సంస్థలలో భారతీయ రైల్వే కూడా ఒకటి.

రైల్వేలో ఏయే ఉద్యోగావకాశాలు వస్తున్నాయి?

టికెట్ కలెక్టర్

కమర్షియల్ అప్రెంటీస్

అసిస్టెంట్ లోకో పైలట్

ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్

ఇవే కాదు, రైల్వేలో ఉన్న ఇతర ఉద్యోగాలకూ అవకాశాలు క్రమం తప్పకుండా వస్తునే ఉంటాయి.

సహజంగానే, వివిధ విద్యార్హతలను బట్టి ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.

భారతీయ రైల్వే వ్యవస్థలో ఉద్యోగం సాధించాలంటే, అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్టు ప్రకారం పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

కానీ ఇంటర్మీడియెట్ (12వ తరగతి) అర్హతతో కూడా మీరు భారతీయ రైల్వేలో మంచి కెరీర్‌ను ప్రారంభించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం, శాశ్వత ప్రాతిపదికన 12 లక్షల నుంచి 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 5 లక్షలకు పైగా 2014 నుంచి 2024 మధ్య కాలంలో నియమితులైనవారే.

అంతకుముందు, 2004 నుంచి 2014 వరకూ 4.11 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.

ప్రస్తుతం రైల్వేలో సుమారు 2.74 లక్షల గ్రూప్-సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

గ్రూప్-సి అంటే స్టేషన్ మాస్టర్, లోకో పైలట్ లేదా ట్రైన్ డ్రైవర్, జూనియర్ ఇంజినీర్, క్లర్క్ తదితర సూపర్‌వైజరీ, టెక్నికల్, నాన్-టెక్నికల్ ఆపరేషనల్ పోస్టులు.

నార్త్‌ర్న్, వెస్టర్న్, సదరన్, ఈస్టర్న్… ఇలా భారతీయ రైల్వేను 18 జోన్లుగా, మళ్లీ ఆ జోన్లను కొన్ని డివిజన్లుగా విభజించారు.

ఈ జోన్లలో టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, మెడికల్, ఆపరేషనల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) తదితర విభాగాల్లో ఉద్యోగ నియామకాలు జరుగుతుంటాయి.

నాలుగు గ్రూపులుగా ఉద్యోగాలు…

విభిన్న విద్యార్హతలు, నైపుణ్యాలను బట్టి రైల్వేలో వివిధ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

గ్రూప్-ఎ: యూపీఎస్‌సీ పరీక్ష ద్వారా భర్తీ అవుతాయి (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు, అకౌంట్ సర్వీసు, ఇంజనీర్ సర్వీసు వంటివి)

గ్రూప్-బి: దాదాపుగా ఈ పోస్టులు గ్రూప్-సి నుంచి పదోన్నతి ద్వారా భర్తీ అవుతాయి.

గ్రూప్-సి: ఆర్ఆర్‌బీ పరీక్ష ద్వారా భర్తీ అవుతాయి (టికెట్ కలెక్టర్, క్లర్క్, లోకో పైలట్ తదితర పోస్టులు)

గ్రూప్-డి: ఆర్ఆర్‌సీ పరీక్షతో భర్తీ అవుతాయి (10వ తరగతి అర్హతతో పోస్టులు)

ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్-సి, గ్రూప్-డి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రెండు గ్రూపుల్లో పోస్టులు 10వ తరగతి, ఇంటర్మీడియెట్ (12వ తరగతి) ఉత్తీర్ణులైనవారి కోసమే ఉద్దేశించినవి.

ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైతే చాలు, దిగువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు…

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు

అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు

జూనియర్ టైమ్ కీపర్

టికెట్ కలెక్టర్ (టీసీ)

రైల్వే కానిస్టేబుల్ (ఆర్‌పీఎఫ్)

స్టేషన్ మాస్టర్ (కొన్ని నాన్-టెక్నికల్ పోస్టులు)

గూడ్స్ గార్డు

మీరు సైన్స్ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థి అయితే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ), టెక్నిషియన్ తదితర పోస్టులు ఉంటాయి.

పదో తరగతి తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లో శిక్షణ పొందినవారికైతే రైల్వే ఉద్యోగం చాలా మంచి అవకాశం.

వేతనం, సౌకర్యాలు ఎలా ఉంటాయి?

ఉద్యోగంతో పాటు పలు సౌకర్యాలను కూడా రైల్వే సమకూర్చుతుంది.

ప్రారంభ వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.45,000

వార్షిక వేతనం: రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షలు

ఇతర సౌకర్యాలు: ఉచిత లేదా రాయితీపై రైల్వే పాసులు, రైల్వే క్వార్టర్లలో వసతి,

వైద్య సదుపాయాలు, పెన్షన్

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత (కొన్ని పోస్టులకు అవసరాన్ని బట్టి ఐటీఐ లేదా డిగ్రీ)

కనీస మార్కులు: 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువ

వయోపరిమితి: సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాలు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలకు వయసు సడలింపు వర్తిస్తుంది)

రైల్వే రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియ దశల వరుస క్రమంపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి (ఆర్ఆర్‌బీ లేదా ఆర్ఆర్‌సీ వెబ్‌సైట్)

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) : జీకే, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరంట్ అఫైర్స్

స్కిల్ టెస్ట్/పీఈటీ (శారీరక సామర్థ్య పరీక్ష)

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెడికల్ టెస్ట్

ఈ అన్ని దశలలో ఉత్తీర్ణులైన తర్వాత, మెరిట్ లిస్టు తయారుచేస్తారు. తదనుగుణంగా అవకాశాలు కల్పిస్తారు.

దరఖాస్తు చేసుకోవడమెలా?

ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్లు వెలువడతాయి.

ఫీజు: రూ.500 (సీబీటీ-1 ఇచ్చిన తర్వాత రూ.400 రిఫండ్ చేస్తారు)

అవసరమైన ధ్రువీకరణ ప్రతాలు: విద్యార్హత సర్టిఫికెట్, ఐడెంటిటీ కార్డు, ఫోటోగ్రాఫ్, అవసరమైన ఇతర సర్టిఫికెట్లు

మొత్తం దరఖాస్తు ప్రక్రియ అంతా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది?

పదోన్నతి, స్థిరత్వం… రైల్వేలో ఉద్యోగానికి సంబంధించి అత్యంత ప్రధానమైన ప్రయోజనాలు.

క్లర్క్ నుంచి స్టేషన్ మాస్టర్ వరకూ పదోన్నతి ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది.

ఏఎల్‌పీ లోకో పైలట్ ఒక్క పదోన్నతితో సీనియర్ లోకో పైలట్ అవుతారు.

పదోన్నతుల ద్వారా రైల్వే కానిస్టేబుల్ ఆ విభాగంలో ఇన్‌స్పెక్టర్ కావచ్చు.

రైల్వే ఉద్యోగం కావాలనుకుంటే..

పోటీ పరీక్షల సన్నద్ధత కోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే టీచర్ జీత్ రాణా కొన్ని సలహాలిచ్చారు.

‘ఈ పరీక్షలకు హాజరుకావాలనుకున్న విద్యార్థులు ఎవరైనా సరే, వారు చేయాల్సిన అత్యంత ప్రధానమైన పని గత ఏడాది ప్రశ్నాపత్రాన్ని ముందుగా సాల్వ్ చేయడం. తద్వారా ఈ పరీక్షల్లో సాధారణంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మీకు ఒక అవగాహన వస్తుంది.

సిలబస్ పూర్తిచేసిన తర్వాత ప్రతి సబ్జెక్టును వేర్వేరుగా ప్రాక్టీసు చేయాలి. ముఖ్యంగా మ్యాథ్స్ ప్రాక్టీసు చాలా అవసరం.

అసలైన పరీక్ష రాయడానికి ముందు ప్రతి విద్యార్థి కనీసం 100 మాక్‌టెస్టులను ప్రాక్టీసు చేయాలి.

దీనివల్ల అసలు పరీక్ష రోజు గందరగోళం ఉండదు. పరీక్ష సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం, మీ మొబైల్ తీసుకొని సెర్చ్ ప్రారంభించండి’ అని రాణా చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.