పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోంది. రాగల రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజుల తర్వాత అల్పపీడనం బలహీన పడనుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలు లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని.. తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్రవారం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.