Rain Alert to Telangana today : గ్రేటర్ లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాతి నుంచి సాయంత్రం 5 గంటలు దాటినా.. బయటికి వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రమైన ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత.. ఒకటేమిటి.. అన్నీ ఎక్కడలేని చికాకును తెప్పిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ మార్పొచ్చింది. ఇళ్లలో ఫ్యాన్లు 24 గంటలు తిరుగుతూ ఉన్నా.. ఉక్కపోత తగ్గడం లేదు.
వేసవి తాపాన్ని భరించలేక ప్రజలు కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగడానికి మక్కువ చూపుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు.. అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణశాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. నేడు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
నిర్మల్, కుమురంభీమ్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లె, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో వర్షాలు పడొచ్చని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. వర్షాలు పడితే మండుటెండల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణం మారితే.. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది. ఇక ఆదివారం హైదరాబాద్ లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.