ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా అనగానే చిత్రసీమ అవాక్కయ్యింది. వీరిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో…అని.
హారర్ కామెడీ జోనర్‌లో సినిమా చేస్తున్నారన్న వార్త ఇంకో షాక్.
ప్రభాస్ లాంటి హీరోకి.. పాన్ ఇండియా కటౌట్‌కి, డైనోసార్ లాంటి ఇమేజ్ కీ, హారర్ కామెడీ ఎలా సెట్టవ్వుద్ది? అసలు మ్యాచ్ అవుతుందా, లేదా? అనేది ఇంకో డౌట్.
ఇది హారర్ కాదు.. హారర్ ఫాంటసీ.. అని చిత్రబృందం కాస్త కవర్ చేసింది. ‘బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఫిల్మ్ ఇన్ గ్లోబ్’ అంటూ నిర్మాత స్టేట్ మెంట్ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు కాస్త సంతృప్తి చెందారు. దాంతో పాటు ఈమధ్య హారర్ కామెడీ సినిమాలు బాక్సాఫీసు దగ్గర దుమ్ము దులపడం, స్త్రీ లాంటి సినిమాలు కోట్లు గుమ్మరించడంతో.. రాజాసాబ్ కూడా మ్యాజిక్ చేస్తుందని నమ్మారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రభాస్ స్పీచు… మారుతి ‘సినిమా నచ్చకపోతే మా ఇంటికి రండి’ అనే స్టేట్‌మెంట్లు.. ఇంకాస్త భరోసాని కలిగించాయి. ట్రైలర్ 2.ఓ కూడా అభిమానులకు నచ్చింది. అలా మెల్లమెల్లగా అనుమానాలు కరిగిపోయి.. నమ్మకం ఏర్పడింది. మరి ఆ నమ్మకాన్ని ‘రాజాసాబ్’ నిలబెట్టుకొన్నాడా? ప్రభాస్ లాంటి కటౌట్ కి మారుతి సాబ్.. న్యాయం చేసేలా స్క్రిప్టు అందించాడా?
రాజు (ప్రభాస్)కు అమ్మానాన్న లేరు. అన్నీ నాయినమ్మ గంగాదేవి (జరీనా వాహెబ్)నే. తనకు అల్జీమర్. పైగా భర్త కనకరాజు (సంజయ్‌దత్)పై బెంగ. చాలా కాలం క్రితమే తనని వదిలేసి వెళ్లిపోయాడు. తన రాక కోసం గంగాదేవి ఎదురు చూస్తుంటుంది. తాతయ్యని ఎలాగైనా తీసుకొస్తానని రాజు హైదరాబాద్ బయల్దేరతాడు. ఇక్కడ బ్లెస్సీ (నిధి అగర్వాల్), భైరవి (మాళవిక) పరిచయం అవుతారు. ఈ క్రమంలో తాతయ్య గురించి రాజుకు కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుస్తాయి. తను నరసాపూర్ ఫారెస్ట్ లోని ఓ ఇంట్లో ఉన్నాడని, ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్లందరికీ రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయని అర్థం అవుతోంది. అసలు కనకరాజు ఎవరు? ఇంటిని వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? అడవిలో ఉన్న ఆ ఇంట్లో జరుగే విచిత్రమైన విషయాలకు కారణం ఎవరు? ఈ విషయాలన్నీ.. తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
హారర్ సినిమా అనగానే.. ఓ ఇల్లు, అందులో దెయ్యం, ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్లందర్నీ ఆ దెయ్యం భయపెట్టడం – ఈ విషయాలే ఉంటాయి. మారుతి గతంలో తీసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ కూడా ఇలాంటి కథే. ప్రభాస్ లాంటి హీరోకి కూడా అలాంటి కథే రాసుకొంటే ఎలా? అందుకే ఈ లైన్ పట్టుకొని, అందులో చిత్ర విచిత్రమైన విషయాలన్నీ మేళవించాడు. హిప్నాటిజమ్, మైండ్ గేమ్ అంటూ చాలా విషయాలు జోడించాలన్న ప్రయత్నం చేశాడు. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే చందమామ కథ లాంటి సెటప్ ఇది. ఓ స్వార్థ పరుడికి, రాజకుమారిపై మనసు పడుతుంది. రాజకుమారితో పాటుగా, తన ఆస్తి పాస్తులన్నీ చేజిక్కించుకోవడానికి మాయలూ మంత్రాలు నేర్చుకొంటాడు. ఆ తరవాత రాజకుమారితో పాటు, తన సంపదంతా తన అధీనంలోకి తెచ్చుకొంటాడు. ఆ తరవాత మనవడు వచ్చి, తాతయ్యపై ప్రతీకారం తీర్చుకొంటాడు. ఇది చందమామ, బాలమిత్రలో చదువుకొన్న ఓ అందమైన ఫాంటసీ కథలా అనిపిస్తుంది. అందులోకి ప్రభాస్ లాంటి హీరోని తీసుకురావడం నిజంగానే మంచి ఐడియా. కాకపోతే.. `రాజాసాబ్`లో ఎగ్జిక్యూషన్ బాగా దెబ్బకొట్టింది. మారుతి ఎంచుకొన్న స్క్రీన్ ప్లే, మధ్యలో ప్రభాస్ కోసం, పాటల కోసం, మాస్ ఆడియన్స్ కోసం చేసిన విన్యాసాలు బోర్ కొట్టించాయి.
సత్య ఎపిసోడ్ తో మారుతి కథ మొదలెట్టిన విధానం బాగుంది. ఆ ఇంట్లో ఏదో ఉంది అనే ఆసక్తి నెలకొంది. కథంతా అదే టోన్‌లో వెళ్లి ఉంటే బాగుండేది. కానీ ఆ కిక్ మొదటి సీన్ వరకే. రాజాసాబ్ ఎంట్రీ, ఫైట్, పాట, రొమాన్స్… ఇలా ఊహకు అందే స్క్రీన్ ప్లేతో, ఎక్కడా ఎంగేజ్ అవ్వడానికి వీలు లేకుండా కథని ‘ఫిల్’ చేసుకొంటూ వెళ్లాడు. అసలు ఈ కథలో ముగ్గురు హీరోయిన్లని ఇరికించాలన్న ఆలోచన మారుతికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ప్రభాస్ ని వింటేజ్ వైబ్ తీసుకురావడానికి ముగ్గురు హీరోయిన్లు అవసరం అయ్యారా? అనిపిస్తుంది. ఆ ముగ్గురి వల్ల కథలో ల్యాగ్ తప్ప లాభం లేదు. పైగా ఏ ఒక్క పాత్రకీ పూర్తి ఆర్క్ ఉండదు. ఆయా రొమాంటిక్ సన్నివేశాల్లో వినోదమైనా పండిందా అంటే అదీ లేదు. ప్రభాస్ డైలాగులు కొన్ని అర్థం కాలేదు. అదేంటో ముద్ద ముద్దగా దొర్లాయి.
ఇంట్రవెల్ ముందు.. కాస్త కథలో అలజడి వచ్చింది. ఇంట్రవెల్ బ్యాంగ్ బెటర్ గా డిజైన్ చేశారు. కాకపోతే.. దాన్ని ఇంకా బాగా తీర్చిదిద్ది ఉండొచ్చు. సెకండాఫ్ మొదలైన అరగంట వరకూ మళ్లీ.. ఒకటే నస. మారుతి సినిమాల్లో కామెడీ బాగుంటుంది. ప్రభాస్ కూడా కామెడీ చేసి చాలా కాలం అయ్యింది. అందుకే వీరిద్దరి సినిమాలో తనివితీరా నవ్వుకొనే సీన్లు కొన్నయినా ఉంటాయి అనుకొన్నారు. కానీ ఆ కామెడీ ఈ సినిమాలో మిస్ అయ్యింది. పోనీ.. హారర్ ఎలిమెంట్స్ అయినా ఉన్నాయా? అంటే అదీ లేదు. హారర్ సినిమా.. భయపడడానికే వెళ్తారు. కానీ ఆ ఆ భయం అనే ఎలిమెంట్ సరిగా తీసుకురాలేకపోయాడు మారుతి. మహల్ లో ఉండే పాత్రలకు సంజయ్ దత్ నుంచి వచ్చే అపాయం ఏమిటన్నది అర్థం కాదు. వాళ్లంతా ఓ సేఫ్ హౌస్ లో ఉన్నట్టు రిలాక్స్ అవుతారు. రొమాన్స్ చేసుకొంటారు. హాంటెడ్ హౌస్ లో కూడా రొమాన్స్ ఏమిటో అర్థం కాదు. వాళ్లే అంత తీరిగ్గా ఉంటే, ప్రేక్షకులకు ఎందుకు టెన్షన్ అనిపిస్తుంది?
ఈ సినిమాలో మారుతి బెటర్ గా ఏదైనా తీశాడంటే అది క్లైమాక్సే. హాస్పటల్ సీన్ నుంచి కాస్త హుషారు మొదలవుతుంది. మైండ్ గేమ్ ని బాగా వాడుకొన్నాడు. ఆ ఊపులోనే క్లైమాక్స్ లోకి వెళ్లిపోయాడు. చివరి 20 నిమిషాలు వర్త్ అనిపిస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా కనకరాజు పాత్రని డిజైన్ చేసిన విధానంలో కొంత కన్‌ఫ్యూజన్ వుంది. తనేదో అపరమేధావి, మానసిక శాస్త్రవేత్త అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే.. సంపద కోసం క్షుద్ర పూజల్ని ఆశ్రయిస్తాడు.. అంతే. దానికి అంత బిల్డప్ ఎందుకు అనిపిస్తుంది?
ప్రభాస్ చాలా స్టైలీష్‌గా కలర్‌ఫుల్ గా కనిపించాడు. తన ఈజ్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. కాకపోతే ఒక్కోసారి ఒక్కోలా కనిపించాడు ప్రభాస్. కొన్ని చోట్ల డూప్ వాడినట్టు స్పష్టంగా అర్థమైపోతోంది. డబ్బింగ్ విషయంలో ప్రభాస్ ఇంకాస్త కేర్ చూపించాల్సివుంది. హాస్పిటల్ సీన్ లో మాత్రం ప్రభాస్ బాగా చేశాడు. ముగ్గురు హీరోయిన్లలో మాళవికకు కాస్త స్క్రీన్ స్పేస్ దొరికింది. తనతో ఓ యాక్షన్ సీన్ కూడా చేయించారు. సంజయ్ దత్ ని సరిగా వాడుకోలేదేమో అనిపిస్తోంది. జరీనా వాహెబ్ నటన, ఆమె పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం బాగున్నాయి. సప్తగిరి, ప్రభాస్ శ్రీను, సత్య.. వీళ్లంతా ఉన్నా నవ్వించలేకపోయారు.
సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు. ముఖ్యంగా మహల్ సెట్ ఆకట్టుకొంటుంది. వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. ఇంకొన్ని చోట్ల తేలిపోయాయి. తమన్ పాటలు బాగా వీక్. నాచె.. నాచె కూడా థియేటర్లో తేలిపోయింది. ఆర్.ఆర్.లో సౌండింగ్ ఎక్కువగా వినిపించింది. మారుతి ఐడియా బాగుంది. హారర్ లో ఫాంటసీ ని మిక్స్ చేయాలన్న ఆలోచన ఓకే. కానీ.. ఎగ్జిక్యూషన్ తప్పిపోయింది. హారర్ ఎలిమెంట్స్ లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. మారుతి సినిమాల్లో ఉండే కామెడీ టైమింగ్ మిస్సయ్యింది. ప్రభాస్ తో తీసిన పాన్ ఇండియా సినిమా ఇది. నాలుగొందల కోట్లు ఖర్చు పెట్టామని, గ్లోబ్‌లోనే ఖరీదైన హారర్ ఫాంటసీ తీశామని చిత్రబృందం చెప్పుకొంది. అయితే అంతటి స్టఫ్ మాత్రం ఈ సినిమాలో లేదు.



































