రజినీకాంత్ సినిమా వస్తుందంటే సందడి మామూలుగా ఉండదు. సినిమా చూసేందుకు లీవ్ కావాలని కార్పొరేట్ కంపెనీలకు లెటర్స్ పెడతారు ఉద్యోగులు. ‘కబాలి’ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో హైప్ తెచ్చుకున్న రజినీకాంత్ మూవీ ‘కూలీ’.
వరుస హిట్లతో ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ వంటి స్టార్లు నటిస్తుండడంతో ‘కూలీ’ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి…
ఆగస్టు 14న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీగా విడుదల అవుతోంది ‘కూలీ’. ఇప్పటికే ఆగస్టు 8న ‘కూలీ’ మూవీని స్పెషల్ షో వేశారు. కోలీవుడ్ ప్రముఖులు, అతికొద్ది మంది ఎంపిక చేసిన అభిమానులు, మీడియా ప్రతినిధులు ‘కూలీ’ మూవీ ప్రైవేట్ స్క్రీనింగ్‌కి హాజరయ్యారు.. ఈ స్పెషల్ షోకి ఫుల్లుగా పాజిటివ్ టాక్ వచ్చినట్టు సమాచారం..
‘కబాలి’ తర్వాత రజినీకాంత్ నుంచి ఆ రేంజ్‌లో పర్ఫామెన్స్ వచ్చిన మూవీగా ‘కూలీ’ మూవీని చెబుతున్నారు అభిమానులు. ‘కూలీ’ మూవీలో రజినీకాంత్ కంటే అక్కినేని నాగార్జున స్పెషల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, ఆయనే ఈ మూవీకి వెన్నెముక అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌కి అభిమానుల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు.
శ్రుతిహాసన్ క్యారెక్టరైజేషన్ హైలైట్‌గా నిలుస్తుందని, ఇక ఆమీర్ ఖాన్ కేమియోకి బాలీవుడ్ థియేటర్లు మోత మోగిపోవడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ‘కూలీ’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బీభత్సంగా జరుగుతున్నాయి. ఓవర్‌సీస్ మార్కెట్‌లో 2 మిలియన్ డాలర్లకు చేరువైంది ‘కూలీ’ మూవీ. కేరళలో బుకింగ్స్ తెరిచిన మొదటి 2 గంటల్లోనే 80 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆదివారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి..
ఈ మూవీలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అన్నాడు. ఆయన మాటలకు తగ్గట్టుగానే మూవీకి ‘A’సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. లెక్క ప్రకారం అయితే 18 ఏళ్లు నిండని వారికి ‘కూలీ’ మూవీ చూడడానికి అనుమతి ఉండదు. అయితే రజినీకాంత్ అభిమానుల ప్రవాహం ముందు ఈ రూల్స్ పనిచేయవని డై హార్డ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
































