ప్రస్తుతం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోంది. ఈ క్రమంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకునే యువతకు చేయూతను అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్.
దీని కింద అర్హులైన ప్రజలకు ఏకంగా 100 శాతం వరకు సబ్సిడీపై రుణాలను అందించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని డిజైన్ చేసింది. దీని కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ముందుగా దీని దరఖాస్తుకు ఈనెల 5 వరకు గడువు ప్రకటించినప్పటికీ ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో తలెత్తిన సమస్యల కారణంగా ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 14 వరకు పొడిగించటంతో ప్రస్తుతం చాలా మంది యువత దీనిని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దరఖాస్తు సమయంలో రేషన్ కార్డు ఉన్న వారు దాని నెంబర్ అందించాల్సి ఉండగా, ఇది లేని వారు మాత్రం ఇన్కమ్ సర్టిఫికెట్ సమర్పించటం తప్పనిసరి.
రాజీవ్ యువ వికాసం పథకం ముఖ్యాంశాలు:
రుణ మంజూరు మొత్తం: రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్లతో.. దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేసే లక్ష్యంతో స్కీమ్ డిజైన్ చేయబడింది
రుణ రాయితీ వివరాలు:
– యూనిట్ ఏర్పాటు కాస్ట్ రూ.50వేలు ఉంటే 100 శాతం రుణ సబ్సిడీ అందించబడుతుంది.
– యూనిట్ ఏర్పాటు ఖర్చు రూ.50వేల నుంచి రూ.లక్ష లోపు ఉంటే 90 శాతం పొందిన రుణంలో సబ్సిడీ ఇవ్వబడుతుంది.
– యూనిట్ ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షలు ఉంటే రుణంలో 80 శాతం సబ్సిడీ అందించబడుతుంది.
– చివరిగా యూనిట్ ఖర్చు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్నట్లయితే తీసుకున్న రుణంలో 70 శాతం రాయితీ అందించబడుతుంది.
రుణాలను పొందిన వ్యక్తులు సబ్సిడీ మెుత్తం పోగా కేవలం మిగిన మెుత్తాలను మాత్రమే స్కీమ్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగనుండగా.. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నట్లు వెల్లడైంది.
దరఖాస్తుకు ఎవరు అర్హులంటే..?
* తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువత
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు
* విద్యార్హత, వయోపరిమితి 21 నుంచి 60 లోపు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు ఉండాలి
* గ్రామీణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.లక్ష 50 వేల లోపు ఉండాలి
* పట్టణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి
దరఖాస్తు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు:
* ఆధార్ కార్డు
* తెలంగాణ డొమిసిల్ సర్టిఫికేట్
* క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్లు
* బ్యాంకు ఖాతా వివరాలు
* రేషన్ కార్డు
* ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ రిజిస్ట్రేషన్
* డ్రైవింగ్ లైసెన్స్
* పట్టాదారు పాస్ పుస్తకం
* పాస్ పోర్ట్ సైజు ఫొటో
రుణ మంజూరు, చెల్లింపు వివరాలు:
రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు చేయబడిన రుణంపై, ప్రభుత్వ రాయితీని తీసివేసిన తరువాత, లబ్ధిదారులు తాము చెల్లించవలసిన మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలి. రుణ చెల్లింపు కాలపరిమితి, వడ్డీ రేట్లు, ఇతర వివరాల కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా సంబంధిత బ్యాంకుతో సంప్రదించడం మంచిది.దరఖాస్తు ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు. స్కీమ్ వివరాలను సైతం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.