`నల్లారి`కి రాజయోగం: గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు..?

www.mannamweb.com


Nallari Kiran Kumar Reddy: భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం కీలక పదవిని కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు నల్లారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి ఆయనే. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డికి అదృష్టం వరించింది. ముఖ్యమంత్రి అయ్యారు.

రాష్ట్ర విభజన తరువాత చాలాకాలం పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో 76 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ గవర్నర్‌గా నామినేట్ చెయ్యొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తెలంగాణ, అక్కడి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించడం.. పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ లేరు. ఇప్పుడున్న సీపీ రాధాకృష్ణన్.. ఇన్‌ఛార్జ్ మాత్రమే. జార్ఖండ్‌కు ఆయన పూర్తిస్థాయి గవర్నర్‌గా ఉంటోన్నారు. గతంలో గవర్నర్‌గా పని చేసిన తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో దిగారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తరువాత తెలంగాణ వంటి కీలక రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ లేకపోవడం సరికాదనే ఉద్దేశంలో ఉంది బీజేపీ. పైగా లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలిచి పట్టు నిలుపుకొంది. దీన్ని మరింత బలోపేతం చేసేలా కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్‌గా పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అంగీకరించారనే అంటోన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు కావడం వల్ల గతంలో పార్టీలు వేరైనప్పటికీ.. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.