అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న రాకాసి అల
విహారయాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన వారిని.. అంతలోనే మృత్యువు కెరటం రూపంలో బలి తీసుకుంది. అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు, ఎస్సై నారాయణరావు కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తీడకు చెందిన ఎన్.కనకదుర్గ (27), మాకవరపాలెం మండలం శెట్టిపాలేనికి చెందిన ఎండపల్లి నూకరత్నం (24) అక్కాచెల్లెళ్లు. వీరితోపాటు ఎలమంచిలి మండలం గొల్లలపాలేనికి చెందిన ద్వారంపూడి శిరీష (23).. తమ కుటుంబానికి చెందిన ఐదుగురితో కలిసి తంతడి-వాడపాలెం తీరంలో గడపడానికి ఆదివారం వచ్చారు. అక్కడ మధ్యాహ్నం వరకు గడిపిన కుటుంబ సభ్యులు.. ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాళ్లపై నిలుచుని ఫొటో తీసుకోవడానికి వెళ్లారు.
నూకరత్నం, శిరీష, కనకదుర్గ ఫొటో తీసుకునే సమయంలో రాక్షస కెరటం వీరిపై ఎగిసిపడింది. అల ఉద్ధృతికి వారు నీటిలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు వీరిని రక్షించడానికి ప్రయత్నించారు. కొద్దిసేపటికి ఆ ముగ్గురినీ ఒడ్డుకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు వెంటనే పరవాడ ఆసుపత్రికి.. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే నూకరత్నం, కనకదుర్గ మృతిచెందారు. శిరీష ప్రాణపాయ స్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కనకదుర్గకు భర్త గణేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.