వీలునామా…ఒక తండ్రి తన పిల్లల మేలుకోరి అందించే ఓ బృహత్తర పత్రం. మామూలు మనుషులైతే తమ ఆస్తిపాస్తుల వివరాలే వీలునామాగా రాస్తారు. మరి మహామనీషి అయిన రామోజీరావు (Ramoji Rao) ఏం రాసి ఉంటారు? ఎవరికి రాసి ఉంటారు? ఇంకెవరికి… తాను కన్న బిడ్డల కంటే మిన్నగా ప్రేమించే తన గ్రూపు సంస్థల ఉద్యోగుల కోసమే ఆయన ఓ వీలునామా రాసిపెట్టి ఉంచారు. ప్రతి ఉద్యోగీ ఓ సమర్థ నిబద్ధ సైనికుడై కదలాలని.. సృజనశక్తితో సవాళ్లను అధిగమించాలని చెబుతూనే అన్ని విజయాల్లోనూ తన సైన్యం మీరేనంటూ అందరిలో స్ఫూర్తి రగిలించారు. తాను నిర్మించిన సంస్థలు, వ్యవస్థలు సుదృఢంగా కలకాలం నిలవాలంటే పునాదులు మీరేనని చెప్పారు.
‘నా జీవన గగనంలో మబ్బులు ముసురుకొంటున్నాయి…
వానగా కురవడానికో, తుపానై విరుచుకుపడటానికో కాదు- నా మలి సంధ్యాకాశానికి కొత్త రంగులు అద్దడానికి’ అన్నాడు రవీంద్ర కవీంద్రుడు. దశాబ్దాలుగా కర్మసాక్షి తొలి వేకువ కిరణాల్లోని చైతన్యస్ఫూర్తిని అనునిత్యం గుండెల్లో పొదువుకొని, సప్తాశ్వ రథారూఢుని కాలగమన వేగంతో సృజన పౌరుషానికి పదునుపెట్టుకొని, తరాల అంతరాలు తెలియనంతగా నిరంతర శ్రామికుడిగా పరుగులు పెట్టిన నాకు- విశ్వకవి మాటలు గుర్తుకొస్తున్నాయిప్పుడు!
ముదిమి మీద పడినా, ‘మార్పు నిత్యం… మార్పు సత్యం’ అని ఘోషించే నా మదిలో నవ్యాలోచనల ఉరవడి పోటెత్తుతూనే ఉంది. ఎప్పుడు ఏ తీరో, ఏ నాటికి ఏ తీరమో తెలియని వార్ధక్యాన్నీ సార్థక్యం చేసుకోవాలన్న తపనే- రామోజీ గ్రూప్ కుటుంబపెద్దగా మీ అందరినీ ఉద్దేశించి ఈ లేఖ రాయడానికి నన్ను ప్రేరేపించింది. ఒక విధంగా ఇది భవిష్య ప్రణాళిక. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బందిగా మీ అందరికీ బృహత్ లక్ష్యాల కరదీపిక!
వ్యక్తికి బహువచనం శక్తి. రామోజీ గ్రూప్ సంస్థలన్నీ నా ఆలోచనల అంకురాలే అయినా, కోట్లాది జనవాహినికి ప్రీతిపాత్రమైన శక్తిమంత వ్యవస్థలుగా అవన్నీ ఎదిగి రాజిల్లుతున్న ఘనతలో- వ్యక్తిగా, వ్యష్టిగా మీరు యావన్మందీ వృత్తి నిబద్ధతతో చేసిన కృషి ఎంతో ఉంది. ఆయా సంస్థల అభివృద్ధిలో ప్రత్యక్ష పాత్రధారులై, వృత్తిగత విలువలకు అంకితమై, సంస్థ పేరే ఇంటిపేరుగా సమాజంలో పేరెన్నికగన్న ఉద్యోగులు ఎందరో నాకు తెలుసు… రామోజీ గ్రూప్ సంస్థల్లో పనిచేయడం ఉద్యోగ శ్రేణులకు ఎంత గౌరవమో, మరెక్కడా లేని స్థాయి క్రమశిక్షణ, సమయపాలన, పని సామర్థ్యం… అన్నింటినీ మించి సంస్థతో మమేకమయ్యే విశిష్ట లక్షణం గల సిబ్బంది ఉండటం నాకు గర్వకారణం. కృషితో నాస్తి దుర్భిక్షం- ఇది, దశాబ్దాలుగా నేను త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్న వ్యాపార సిద్ధాంతం! కాబట్టే, నా సంస్థలన్నీ ప్రజాప్రయోజనాలతో నేరుగా ముడివడి, విస్తృత మానవవనరుల వినియోగంతో జతపడి- పని ప్రమాణాలతో ఉన్నత విలువలకు పట్టం కడుతున్నాయి. దశాబ్దాలుగా వెన్నంటి నిలిచి, నా ఆశయ సాఫల్యానికి సైదోడుగా నిలిచిన యావత్ సిబ్బందికీ కృతజ్ఞతాంజలి!
చేసే పని, చేపట్టే ప్రాజెక్టు ఏదైనా అద్వితీయంగా రాణించాలి గాని, రెండో స్థానంలో సర్దుకోలేకపోవడం నా జీవలక్షణం. ఆ తపనతోనే, జీవితమనే కొవ్వొత్తిని రెండువైపులా వెలిగించి మార్గదర్శి మొదలు ఈటీవీ భారత్ వరకు అన్నింటినీ అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి, తెలుగుజాతి కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేయడానికి అక్షరాలా నేను చేసింది అసిధారా వ్రతం. జీవన పర్యంతం పరితపించి, పరిప్లవించి నేను నిర్మించిన సంస్థలు, వ్యవస్థలు సుదృఢంగా కలకాలం నిలవాలన్నదే నా ఆకాంక్ష. ప్రత్యక్షంగా పాతిక వేలమంది ఉపాధికి, పరోక్షంగా మరో పాతిక వేలమంది జీవన భుక్తికి ఆధారభూతమైన రామోజీ గ్రూప్ సంస్థల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇచ్చేలా పటిష్ఠ యాజమాన్య, మార్గదర్శక పునాదుల్ని సిద్ధం చేశాను. నా తదనంతరం కూడా, సమున్నత సంప్రదాయాలు సర్వదా కొనసాగి రామోజీ సంస్థల ఖ్యాతి ఇంతలంతలయ్యేలా మీరంతా విద్యుక్త ధర్మానికి నిబద్ధమవ్వాలని కోరుకొంటున్నాను.
సమాచారం విజ్ఞానం వినోదం వికాసం- ఏ జాతి భవితనైనా దేదీప్యమానం చేసే నాలుగు కీలక రంగాలివి. రామోజీ గ్రూప్ సంస్థలన్నీ ఆ నాలుగు మూలస్తంభాలపైనే నిలబడి నిరంతర ప్రజాసేవా యజ్ఞంలో పాల్పంచుకొంటున్నాయి. ఏనాటికీ చెక్కుచెదరని ప్రజావిశ్వాసం, సమాదరణలే వెన్నుదన్నుగా పురోగమిస్తున్నాయి. జ్వలనశీల జర్నలిజంలో ‘ఈనాడు’ జైత్రయాత్ర; ‘ఉషోదయ’ ఇతర ప్రచురణల ప్రయోజకత్వం జగద్విదితం. రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించిన ‘మార్గదర్శి’ కోట్లాది మదుపరులకు అక్షరాలా కొంగుబంగారం. దేశం నలుమూలలకూ చొచ్చుకుపోతున్న ‘ఈటీవీ’, ఈటీవీ భారత్ నెట్‌వర్క్‌లు మన బలం. తెలుగింటి రుచుల రాయబారిగా ‘ప్రియ’ స్థానం పదిలం. రామోజీ ఫిల్మ్ సిటీ దేశానికే తలమానికం.
ఇలా- అన్ని విజయాల్లోనూ నా సైన్యం మీరు…
‘రామోజీ’ ఉద్యోగులంటేనే- క్రమశిక్షణకు మారుపేరు!
ఇకముందూ- మీ ఉద్యోగం సంస్థతో అనుబంధంగా ఒదిగి.. స్వామికార్యం స్వకార్యంలా ఉద్యోగ సోపానంలో ఎదిగి.. సృజన శక్తితో సవాళ్లను అధిగమించి.. రామోజీ గ్రూప్ దిగ్విజయ యాత్ర అప్రతిహతమయ్యేలా.. ప్రతి ఉద్యోగీ ఓ సమర్థ నిబద్ధ సైనికుడై కదలాలి!
చెదరని నమ్మకానికి రామోజీ గ్రూప్ సంస్థలే చిరునామా… దాన్ని నిలబెట్టాల్సిన కర్తవ్యాన్ని మీపై మోపుతూ- ఇది నేను రాస్తున్న బాధ్యతల వీలునామా!