అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా ఉన్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రముఖలు రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రేవంత్ ట్వీట్ చేశారు. ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.