మహిళలతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడినా తోలు తీస్తామని సీఎంగా ఛార్జ్ తీసుకోగానే చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటివారిని ఎట్టి పరిస్థితిల్లో ఉపేక్షింపబోమన్నారు.
అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడాడు. బాలికను ఆటోలో ఎక్కించుకుని ఊరు శివారుకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం తర్వాత బాలిక అపరస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా, స్థానికులు నిందితుడు జాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడికి సహకరించిన మహిళను కూడా అందుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ జాన్… మాజీ కౌన్సిలర్, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు భర్త కావడంతో ఈ ఇష్యూ పొలిటికల్‌గా రచ్చ రేపుతోంది.
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు. అయితే అగత్యానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం ఈ కేసును పర్యవేక్షిస్తూ ఉండటంతో.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. కేసును సీరియస్‌గా విచారిస్తున్నారు.