కారుకి ఉద్యోగి పేరు పెట్టిన రతన్ టాటా.. ఇందుకు కదా ఆయనను గ్రేట్ అనేది

టాటా కార్లకు ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళను దృష్టిలో పెట్టుకుని రతన్ టాటా తీసుకునే నిర్ణయాలు ఎంతో సాహసోపేతంగా ఉంటాయి. ఆయన తీసుకొచ్చిన నానో కారు కానివ్వండి.. టాటా స్టార్ బజార్ కానివ్వండి.. ఇలా కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తక్కువ ధరకు అందించేలా అందుబాటులోకి తీసుకొస్తారు. నానో కొన్ని కారణాల వల్ల ఆగిపోయినా మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ తో రాబోతుంది. ఇక రతన్ టాటా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఎంతో విలువ ఇస్తారు. ఆయన కారు డ్రైవర్ తో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎంత ఎత్తుకి ఎదిగినా చాలా నిరాడంబరంగా ఉంటారు. అలాంటి రతన్ టాటా.. తన కంపెనీ కారుకి ఒక ఉద్యోగి పేరు పెట్టారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం.


సాధారణంగా ఏ కంపెనీ కారు చేసినా గానీ ఉద్యోగి పేరు పెట్టడం అనేది జరగదు. కానీ రతన్ టాటా మాత్రం ఏకంగా ఉద్యోగి పేరు మీద ఒక మోడల్ ని అంకితం చేశారు. టాటా కంపెనీలో కష్టపడి పని చేసి సంస్థ విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగి పేరుని టాటా సుమో కారుకి పెట్టారు. ఆ ఉద్యోగి పేరు సుమంత్ మోల్గావ్కర్.. ఈయన టాటా మోటార్స్ సంస్థ ఎండీగా పని చేశారు. అయితే ఈయన రోజూ లంచ్ సమయంలో ఏదో సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. అలా వెళ్లిన చాలా సేపటికి మళ్ళీ ఆఫీస్ కి వచ్చేవారు. దీంతో ఈయన మీద ఆఫీస్ లో రూమర్లు క్రియేట్ చేశారు. ఈయన రోజూ ఈ సమయంలో ఏం చేస్తున్నారా అని కొంతమంది ఉద్యోగులు రహస్యంగా ఆయనను ఫాలో అయ్యారు. అప్పుడు మోల్గావ్కర్ ట్రక్ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన భోజనం చేస్తూ కనిపించారు.

ఎందుకు వాళ్లతో ఏం పని అనుకున్నారు. అయితే ఆయన టాటా వాహనాలు వాడే డ్రైవర్లు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అడిగేవారు. సమస్యలు తెలుసుకునేవారు. బాగున్న అంశాలు ఏంటి? లోపాలు ఏంటి అని గుర్తించిన తర్వాతే ఆఫీస్ కి తిరిగి వచ్చేవారు. ఇక కంపెనీలో పని చేస్తున్న ఆర్ అండ్ డీ టీమ్ కి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా లోపాలను సరిద్దిదుతూ ఎప్పటికప్పుడు టాటా కార్లను మార్కెట్ లో సక్సెస్ అవ్వడంతో కృషి చేశారు. సంస్థ విజయంలో ఇంత అంకితభావంతో పని చేసినందుకు కృతజ్ఞతగా.. సుమంత్ మోల్గావ్కర్ పదాల్లోని మొదటి రెండు అక్షరాలను టాటా కారుకి నామకారణం చేశారు. సుమంత్ లో సుని, మోల్గావ్కర్ లో మోని తీసుకుని సుమోగా మార్కెట్లో విడుదల చేశారు. ఇది ఆయన తన ఉద్యోగికి ఇచ్చిన అరుదైన గౌరవం. ఇక టాటా సుమో కూడా అప్పట్లో బాగా సక్సెస్ అయ్యింది. చివరగా టాటా సుమో గోల్డ్ 2018లో లాంఛ్ అయ్యింది. 10 సీట్లు కలిగిన ఈ ఎస్యూవీ ధర రూ. 5.26 లక్షల నుంచి రూ. 8.93 లక్షల మధ్య ఉంది.