తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…. జనవరి 25న తిరుమలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణలతో కలిసి రథ సప్తమి రోజున భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ… తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో అధికారులందరూ రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
సమగ్ర బందోబస్తు పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని వెంకయ్య చౌదరి కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ, సోషియల్ మీడియాలో ప్రచారం ఇతర ఏర్పాట్లపై కూడా ఈ సందర్భంగా సమీక్షించారు.
అలాగే, రథసప్తమి సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్టుగా వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. ఇక, రథసప్తమికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో జనవరి 24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్టుగా తెలిపారు.
రథసప్తమి రోజున వాహన సేవలు
>> తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
>> ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
>> ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
>> మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
>> మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
>> సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
>> సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
>> రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు :
>> కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.
>> ఎన్‌ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు.
>> తిరుపతిలో జనవరి 24 నుంచి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లు జారీ రద్దు.
>> ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.




































