ప్రభుత్వ బ్యాంకుకు ఆర్బీఐ షాక్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొంత కాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కస్టమర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంకులు లేదా తమ కనీస నిబంధనలు పాటించని..


నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులు సహా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), ఇతర ఆర్థిక సంస్థలపై చర్యలు తీసుకుంటోంది. ఇవన్నీ ఆర్బీఐ నియంత్రణంలోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అత్యంత పారదర్శకంగా కస్టమర్లకు సేవలు అందించడంపై దృష్టి సారించాలి. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడినట్లు తెలిసినా.. ఇతర సేవల్లో, నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏ మాత్రం ఊరుకోవట్లేదు. పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తుంటుంది. ఇంకా సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఇతర కఠిన ఆంక్షలు విధిస్తుంటుంది. ఇంకొన్ని సార్లు ఏకంగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేసేస్తుంది.

ఇప్పుడు నిబంధనల ఉల్లంఘించిందన్న కారణంతో.. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. కొత్త సంవత్సరంలో జనవరి నెలలోనే వరుసగా రెండు సార్లు జరిమానాలు విధించింది. కరెన్సీ చెస్ట్‌లో నగదు కొరత ఉన్నట్లు గుర్తించిన కేంద్ర బ్యాంకు.. పీఎన్‌బీపై రూ. 1,27,150 మేర ఫైన్ వేసింది. బ్యాంక్ జనవరి 8న ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

అంతకుముందు జనవరి 6న కూడా పీఎన్‌బీపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. అక్కడ కరెన్సీ చెస్ట్ నిర్వహణలో లోపాలు సహా నోట్ల కొరత కారణంగా ఏకంగా రూ. 4.85 లక్షల మానిటరీ పెనాల్టీ విధించింది. అయితే దీని వల్ల బ్యాంక్ ఆర్థిక కార్యకలాపాలపై పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. సెబీ నిబంధనలకు అనుగుణంగా.. ఈ వివరాల్ని బ్యాంకులు వెల్లడించాల్సి వస్తుంది.

కరెన్సీ చెస్ట్‌లు అంటే.. ఆర్బీఐ తరఫున బ్యాంకులు నగదు నిల్వ చేసే కేంద్రాలు. ఇక్కడ ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి అవసరమైన నోట్లు, నాణేల్ని భద్రపరుస్తారు. వీటిని నిర్వహించడంలో నిబంధనలు పాటించకుంటే లేదా నగదు లెక్కల్లో తేడాలు వస్తే ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీ కింద పెనాల్టీ విధిస్తుంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు విషయానికి వస్తే ఇది దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి. 1894లో లాహోర్‌లో దీనిని స్థాపించారు. ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 2020లో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పీఎన్‌బీలో విలీనం అయ్యాయి. ఇది సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అన్ని రకాల లోన్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. పీఎన్‌బీ షేరు ధర ప్రస్తుతం రూ. 122.87 వద్ద ఉంది. మార్కెట్ విలువ రూ. 1.41 లక్షల కోట్లుగా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.