రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. త్వరలో కొత్తగా రూ. 5 వేల విలువైన కరెన్సీ నోట్లను జారీ చేస్తుందంటూ.. సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు, వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీంతో చాలా మంది నిజమనే నమ్ముతున్నారు. తెలిసీ తెలియక వాటిని ఇతరులకు షేర్ చేయడం.. సామాజిక మాధ్యమాల్లో రీపోస్ట్ చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో జనం దీనిని నిజమని నమ్మేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రచారాన్ని అధికారికంగా ఖండించింది. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం.. సోమవారం సాయంత్రం తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కొత్త రూ. 5 వేల నోట్లను తీసుకురావాలన్న నిర్ణయమేదీ ఆర్బీఐ తీసుకోలేదు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.’ అని ఆ పోస్టులో తెలిపింది.
ఇటీవలి కాలంలో నకిలీ సమాచారం వ్యాప్తి, ఆన్‌లైన్ మోసాలు విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరచుగా ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ Https://rbi.org.in ను మాత్రమే సంప్రదించాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా విజ్ఞప్తి చేసింది కేంద్రం.
>> గతంలో 2016, నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి పెద్ద నోట్లుగా చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసింది. తర్వాత కొత్త డిజైన్లలో రూ. 500 కొత్త నోట్లు సహా రూ. 2 వేల విలువైన నోట్లు కూడా వచ్చాయి. తర్వాత రూ. 2 వేల నోటును 2023 మే నెలలో చలామణి నుంచి ఉపసంహరించుకుంది ఆర్బీఐ. ఇప్పటికీ ఇవి చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతున్నప్పటికీ.. ఇవి జనం దగ్గర పెద్దగా అందుబాటులో లేవు.



































