తాజాగా, ఓ మనిషి ప్రాణాలను ఏఐ కాపాడింది… డాక్టర్లే షాక్..

ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఎంతలా అభివృద్ధి చెందుతోందో మనిషి ఊహలకు కూడా అందటం లేదు. కొన్ని విషయాల్లో AI మనుషులకే సవాల్ విసురుతోంది. మనిషికి సాధ్యం కాని పనులను కూడా ఇట్టే చేసేస్తోంది. మెడికల్ రంగంలోనూ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. డాక్టర్లే చేతులు ఎత్తేసిన కేసుల్లో.. రోగులకు అండగా నిలుస్తోంది. తాజాగా, ఏఐ ఓ రోగి ప్రాణాలు కాపాడింది. చావు అంచుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతడికి ప్రాణం వచ్చేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చెందిన జోషఫ్ కొవాటెస్ అనే 37 ఏళ్ల వ్యక్తి పోయెమ్స్ సిండ్రోమ్ అనే రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యాధి అతడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.


జోషఫ్ కాళ్లు, చేతులు మొద్దుబారి పోయాయి. గుండె లావుగా అయింది. కిడ్నీలు పాడైపోయాయి. డాక్టర్లు రెండు, మూడు రోజులకు ఒకసారి అతడి శరీరంలోంచి వ్యర్థ ద్రవాలను బయటకు తీస్తూ ఉన్నారు. అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఎంతలా అంటే.. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేసన్ చేద్దామని డాక్టర్లు అనుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి చూసి ఆగిపోయారు. అతడికి ఇబ్బంది కలిగించని చికిత్సలు చేస్తూ ఉన్నారు. డాక్టర్లు ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. జోషఫ్ కూడా తన ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. కానీ, అతడి ప్రియురాలు మాత్రం ఆశలు వదులుకోలేదు. ప్రియుడ్ని ఎలాగైనా బతికించుకోవాలని అనుకుంది. సమస్యకు పరిష్కారాన్ని వెతకటం మొదలెట్టింది.

ఓ సంవత్సరం క్రితం ఆమె ‘రేర్ డిసీజ్ సమిట్’లో పాల్గొంది. అక్కడ ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్ డేవిడ్‌ను కలుసుకుంది. ఆయనకు జోషఫ్ పరిస్థితి వివరిస్తూ ఓ లేఖ రాసింది. దానికి ఆయన స్పందించారు. ఏం చేస్తే జోషఫ్ ఆరోగ్యం బాగు పడుతుందో వివరించాడు. అతడు చెప్పినట్లే చేశారు. జోషఫ్ కొద్ది కొద్దిగా కోలుకోవటం మొదలెట్టాడు. నాలుగు నెలల తర్వాత డాక్టర్లు అతడికి స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఇప్పుడు జోషఫ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ మొత్తం స్టోరీలో ఏఐ పాత్ర ఏముంది?.. డాక్టర్ డేవిడ్ చెప్పిన చికిత్స పని చేసింది అనుకుంటున్నారా?.. ఇక్కడే మీరు పొరబడుతున్నారు. డాక్టర్ డేవిడ్ కూడా ఏఐ నుంచి సజెషన్స్ తీసుకుని.. ఏం చేయాలో జోషఫ్ ప్రియురాలికి చెప్పాడు. ఏఐని ఉపయోగించి చికిత్సలు అందించే డాక్టర్ల టీంలో డేవిడ్‌ కూడా ఓ సభ్యుడు.