ఒక్కసారి మధుమేహం నిర్ధారణ అయ్యిందంటే చాలు! ఇక దాన్ని తగ్గించుకోవడానికి చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటం, డాక్టర్లు సూచించిన మందులను వాడుతూ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మందులతో పాటు, కొన్ని సహజమైన పద్ధతులు కూడా బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
యాక్టివ్‌గా ఉండటం : శారీరక శ్రమను పెంచుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కండరాలు గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయని, దీనివల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయని వివరించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుందని పేర్కొన్నారు.
ఫైబర్ ఎక్కువగా : ఫైబర్ ఉన్న ఆహారం షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో కరిగే ఫైబర్ కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆపిల్స్, అరటిపండ్లు, ఓట్స్, బఠానీలు, బ్లాక్ బీన్స్, లిమా బీన్స్, బ్రస్సెల్స్ మొలకలు, అవకాడోలలో ఈ ఫైబర్ కనిపిస్తుందని Centers for Disease Control and Prevention అధ్యయనంలో పేర్కొంది.
తినే ఆహార పరిమాణం : ఒకేసారి ఎక్కువ ఆహారం తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు వేగంగా పెరగవచ్చని, కాబట్టి, ఆహారం పరిమాణాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆహారాన్ని తక్కువగా ఎక్కువ సార్లు తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉంటాయని తెలిపారు.
తక్కువ గ్లైసెమిక్ కార్బోహైడ్రేట్ల : ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్లను ఎంచుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయని సూచిస్తున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలు నెమ్మదిగా జీర్ణమవుతాయని, దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతుందని వివరించారు.
ఒత్తిడి అదుపులో : ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం, యోగా, వాకింగ్ వంటి పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, ఫలితంగా రక్తంలో షుగర్ అదుపులో ఉంచవచ్చని, అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి క్రమంగా శరీర బరువు తగ్గడం, ఇన్సులిన్ నిరోధకత, విసెరల్ విసెరల్ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణమవుతుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.
క్రమం తప్పకుండా తనిఖీ : రోజువారీ బ్లడ్ షుగర్‌ను తనిఖీ చేసుకోవడం వల్ల తీసుకునే ఆహారం, చేసే పనుల వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతుందో లేదా పెరుగుతుందో తెలుసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. దీనివల్ల ఆహార ప్రణాళికను, వ్యాయామాలను చేయాలని తెలిపారు.
ఈ ఆహార పదార్థాలతో : క్రోమియం, మెగ్నీషియం నోటి ద్వారా తీసుకునే సప్లిమెంటేషన్లు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. మెగ్నీషియం కార్బోహైడ్రేట్ జీర్ణక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈ పోషకాలు ఉన్న ఆహారాలు బ్లడ్ షుగర్ నియంత్రణకు దోహదపడతాయంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
































