రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల

www.mannamweb.com


అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు.. యావత్‌ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి.. చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు.

‘‘అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరం. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సూచించారు. అమరావతి పేరును క్యాబినెట్‌లో వందశాతం అంగీకరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచాం. యమునా నది నీరు, పార్లమెంట్‌ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారు. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్ర భవిష్యత్తును ఆకాక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలి. విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది. తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్‌కు ఇచ్చాం.

29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా జగన్‌ చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్‌ ఏం చేశారో ప్రజలే చూశారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది. ఇన్ని కిలోమీటర్ల రివర్‌ ఫ్రంట్‌ ఎక్కడా లేదు. ఒక వైపు గోదావరి, మరో వైపు కృష్ణా రెండు నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్‌ అందుబాటులో ఉంటుంది.

అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది..
విభజన సమయంలో మనకు లోటు బడ్జెట్‌ఉంది. ప్రాజెక్టు ఏదైనా విన్‌ విన్‌ పరిస్థితిలోనే ముందుకు తీసుకెళ్లా. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొచ్చారు. సింగపూర్‌.. మనకు మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. తొమ్మిది విభాగాల్లో అమరావతి హబ్‌గా మారాలని ఆకాంక్షించాం. ఫైనాన్షియల్‌, నాలెడ్జ్‌, టూరిజం, ఎలక్ట్రానిక్‌, హెల్త్‌ సిటీ ప్రతిపాదించాం. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలోని ఏ నగరానికీ అమరావతిలా సౌలభ్యం లేదు. జగన్‌ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం. అమరాతి రైతులను అనేక రకాలుగా అవమానించారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. శ్రీకాకుళం యాత్రకు వెళ్తే మధ్యలోనే అడ్డుకున్నారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది.

శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం
అమరావతి విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారు. రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరు. క్యాపిటల్‌ మార్పు జరిగితే ఏం జరుగుతుందో దేశానికిది కేస్‌ స్టడీ. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా? కేసులు ఎదుర్కొంటున్న అమరావతి రైతులకు న్యాయం చేస్తాం. ఏం జరిగినా వెనక్కి చూడను.. ముందుకే వెళ్తా. న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తాం. ఒకసారి నమ్మకం కోల్పోతే పెట్టుబడిదారులు మళ్లీ రారు. ఇప్పుడు పెట్టుబడి దారులను రప్పించాలంటే చాలా కష్టపడాలి. మళ్లీ ఇబ్బందులు రావని భరోసా ఏమిటని అడుగుతున్నారు? మన రాష్ట్రంలో అవకాశాలు లేవా.. ప్రజలకు తెలివితేటలు లేవా? మన రాష్ట్రం రైస్‌ బౌల్‌ అని దేశ వ్యాప్తంగా పేరుంది. మనకు మంచి భూములు ఉన్నాయి.. పండించే రైతులు ఉన్నారు. అమరావతికి బ్రాండ్‌ ఇమేజ్‌ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నాం. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలి. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అంచెలంచెలుగా పూర్తి చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.