క్రైమ్ థిల్లర్‌ను తలపించేలా.. కట్టుకున్న భర్తను చంపించిన భార్య.. ట్విస్టులు మామూలుగా లేవు!

www.mannamweb.com


Panipat businessman murder case: తమకు అడ్డుగా ఉన్న భర్తను చంపించేందుకు ప్రియుడితో కలిసి ఓ భార్య ఖతర్నాక్ ప్లాన్ వేసింది. కిరాయి హంతకుడికి రూ.10 లక్షలు ఇచ్చి లారీతో ఢీకొట్టించి భర్తను హత్య చేయించాలనుకుంది.

బ్యాడ్ లక్.. అతడు గాయాలతో బయటపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత ఇంట్లోనే అతడు హత్యకు గురయ్యాడు. అయితే లారీతో ఢీకొట్టిన వ్యక్తి జైలు వెళ్లాడు. మృతుడి భార్య తన ప్రియుడితో కలిసి మనాలి టూర్ వెళ్లింది. మూడేళ్లు గడిచిపోవడంతో కేసు దాదాపు ముగిసిందని అనుకున్నారు. కానీ అప్పుడే కేసులో ఊహించని ట్విస్ట్.. ఏంటది?

హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త వినోద్ భరారా 2021, డిసెంబర్ 15న తన ఇంట్లో కాల్చి చంపబడ్డాడు. దేవ్ సునర్ అనే ట్రక్ డ్రైవర్ ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ కేసులో కోర్టు వెలుపల సెటిల్‌మెంట్‌కు నిరాకరించినందున వినోద్‌ను కాల్చి చంపినట్లు పోలీసులకు అతడు చెప్పాడు. బాధితుడు చనిపోయాడు, నిందితుడు అరెస్టయ్యాడు. అంతటితో కేసు ముగిసిందని అంతా అనుకున్నారు.

మలుపు తిప్పిన వాట్సాప్ మెసేజ్
ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ సోదరుడు ప్రమోద్ నుంచి ఒకరోజు పానిపట్ జిల్లా పోలీసు చీఫ్, ఐపీఎస్ అధికారి అజిత్ సింగ్ షెకావత్ ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తన సోదరుడి హత్య కేసును మరోసారి విచారించాలని, వినోద్‌కు అత్యంత సన్నిహితులైన వారే అతడి హత్యకు సూత్రధారిగా అనుమానిస్తున్నామంటూ మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో షెకావత్ మరోసారి వినోద్ హత్య కేసు పైళ్లను పరిశీలించగా ఏదో తేడా కొట్టింది. యాక్సిడెంట్ కేసులో సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోలేదన్న ఏకైక కారణంతో వినోద్‌ను చంపేసారా, మరేదైనా కారణం ఉందా అనే ప్రశ్నతో కేసును మరో కోణంలో విచారించడంతో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానా పోలీసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సీనియర్ అధికారి దీపక్ కుమార్‌ ఆధ్వర్యంలోని స్పెషల్ కేసును కొత్త కోణంలో విచారించగా కీలక లీడ్ దొరికింది. వినోద్ భరారా భార్య నిధి గురించి బాగా తెలిసిన జిమ్ ట్రైనర్ సుమిత్‌తో నిందితుడు దేవ్ సునర్ సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. అనుమానితులు ముగ్గురినీ లోతుగా విచారించడంతో అసలు కుట్ర బయటపడింది.

Also Read:
స్టార్ హీరో దర్శన్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు.. అసలెవరీ ప్రవిత్రా గౌడ?

బెడిసికొట్టిన ప్లాన్ ఏ
జిమ్ ట్రైనర్ సుమిత్‌తో నిధి భరారా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి భార్యను వినోద్ మందలించడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. తన భార్యకు దూరంగా ఉండాలని సుమిత్‌కు వినోద్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో వినోద్‌ను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి నిధి ప్లాన్ వేసింది. వినోద్‌ను చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని భావించి.. పంజాబ్‌కు చెందిన దేవ్ సునర్ అనే ట్రక్ డ్రైవర్‌కు రూ. 10 లక్షలు ఆఫర్ చేశారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం 2021, జనవరి 5న తన ట్రక్‌తో వినోద్ కారు ఢీకొట్టాడు దేవ్ సునర్. అయితే తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రాణాలు దక్కించుకున్నాడు వినోద్. తమ పథకం బెడిసికొట్టడంతో నిధి, సుమిత్‌.. ప్లాన్ బీ అమలు చేశారు. యాక్సిడెంట్ కేసును సెటిల్‌మెంట్‌ చేసుకుందామని దేవ్ సునర్‌ను వినోద్ ఇంటికి పంపించారు. సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోకపోవడంతో వినోద్‌ను కాల్చిచంపాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వినోద్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత సుమిత్, నిధి మనాలీ ట్రిప్‌కు వెళ్లిపోయారు. నిధి తన కుమార్తెను ఆస్ట్రేలియాలోని వినోద్ సోదరుడి ఇంటికి పంపించేసింది.

కుట్రను ఎలా కనిపెట్టారు?
ఆస్ట్రేలియా నుంచి ప్రమోద్ పంపిన వాట్సాప్ మెసేజ్ రావడంతో పోలీసులు కొత్త కోణంలో విచారణ చేపట్టి కీలక విషయాలు కనుగొన్నారు. జైలులో ఉన్న దేవ్ సునర్‌కు లీగల్, కుటుంబ ఖర్చులకు నిధి డబ్బులు ఇచ్చినట్టు గుర్తించారు. వినోద్ మరణంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బును అతడికి ఖర్చుపెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త హత్యలో ప్రధాన సాక్షిగా ఇచ్చిన వాంగూల్మాన్ని కూడా నిధి ఉపసంహరించుకుంది. వినోద్ హత్యలో నిధి, సుమిత్ కుట్ర బయటపడడంతో వాద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారు ఇప్పుడు జైలులో ఉన్నారు.