గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఉచితబస్సు హామీ మేరకు.. `స్త్రీ శక్తి` పేరుతో రాష్ట్రంలో ఉచిత బస్సును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే.. ఈ పథకానికి సంబంధించి కొన్ని షరతులు విధించారు. వీటి ప్రకారం.. ఘాట్ రోడ్లలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సర్వీసులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. ఇక, బస్సులో ప్రయాణించే సమయంలో మహిళలు ఆధార్ సహా.. ఇతర గుర్తింపు కార్డులను ఒరిజినల్‌వే చూపించాలని పేర్కొన్నారు.
ఈ నిబంధనలతోనే స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. అయితే.. శనివారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు మహిళలు జోరుగా ప్రయాణించారు. ఈ సమయంలో చాలా మంది ఒరిజినల్ గుర్తింపు కార్డులు లేకుండానే బస్సులు ఎక్కారు. కేవలం జిరాక్సులు, లేదా ఫోన్లలో ఉన్న డిజిటల్ గుర్తింపు కార్డులను చూపించారు. వీటిని కండెక్టర్లు అనుమతించలేదు. దీంతో మహిళలు వీటిని కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందింది. అలానే.. ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లో ఉచితం లేదన్న విషయం తెలియక.. మన్యం సహా.. పార్వతీపురం, లోతుగడ్డ, లంబసింగి తదితర ప్రాంతాల్లో గిరిజనులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాలు కూడా ఉన్నతాధికారులకు చేరాయి.
మొత్తంగా ఏ నిబంధనలు పెట్టారో.. అవే సమస్యగా మారాయి. మిగిలిందంతా హ్యాపీగానే సాగిపోయింది. మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇక, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించిన ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు వ్యవహారంపై శనివారం రాత్రి 10 గంటల సమయంలో సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. 30 గంటల్లో జరిగిన వ్యవహారాలను మహిళల ఫీడ్ బ్యాక్‌ను కూడా తెలుసుకున్నారు. మొత్తంగా 12 లక్షల మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారని అధికారులు వివరించారు. అదేసమయంలో తమకు ఎదురైన సమస్యలు, మహిళల డిమాండ్లను కూడా సీఎం ముందు పెట్టారు. వీటిపై స్పందించిన సీఎం.. వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక, నుంచి ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. అయితే, తిరుమల, అన్నవరం వంటి ఆలయాల ఘాట్ రోడ్ల విషయంలో మాత్రం ఆలయ బోర్డులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఘాట్ ఉన్నా ఉచితంగా అనుమతించాలని సీఎం ఆదేశించారు. ఇక, గుర్తింపు కార్డులు ఒరిజినల్‌వి లేకపోయినా.. జిరాక్స్ కాపీలను అనుమతించేలా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫొటో కనిపించేలా ఉంటే వాటిని కూడా అనుమతించవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను దాదాపు తీసేసినట్టు అయింది. ఇది మహిళలకు మరింత సంతోషం కలిగించే చర్యగా సీఎం చంద్రబాబు చెప్పారు.
































