రెనాల్ట్ తన పాపులర్ మోడల్ ‘డస్టర్’తో పాటు మరో అద్భుతమైన ఎస్‌యూవీ ‘రఫేల్’ను కూడా భారత్‌కు తీసుకురానున్నట్లు కనిపిస్తోంది. అదిరిపోయే డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్‌తో ఈ కారు ఇటీవల భారత రోడ్లపై కనిపించింది. ఈ రెనాల్ట్ రఫేల్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
భారతీయ ఆటోమొబైల్ మార్కె్ట్లో తన పట్టును మరింత పెంచుకోవాలని రెనాల్ట్ గట్టి ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగానే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సరికొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జనవరి 26న తన పాపులర్ మోడల్ ‘డస్టర్’ ఎస్‌యూవీని సరికొత్త రూపంలో భారత్‌కు పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా, తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఎలాంటి ముసుగులు లేకుండా, మెరిసిపోతున్న ‘రెనాల్ట్ రఫేల్’ కారు భారత రోడ్లపై దర్శనమిచ్చింది.
ప్రస్తుతానికి ఈ కూప్-ఎస్‌యూవీ భారత్‌లో అధికారికంగా లాంచ్ చేస్తామని కంపెనీ చెప్పకపోయినప్పటికీ, ఇది ఇండియన్ రోడ్లపై కనిపించడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ కారు ఎంట్రీ ఖాయమనిపిస్తోంది. బహుశా ఏదైనా ఈవెంట్‌లో ప్రదర్శించడానికో లేదా టెస్టింగ్ కోసమో దీనిని తీసుకొచ్చి ఉండవచ్చు.
అదిరిపోయే లుక్.. అదిరే డిజైన్!
సీఎంఎఫ్-సీ/డీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ కూపే-ఎస్‌యూవీ, రెనాల్ట్ కొత్త డిజైన్ శైలిలో కనిపిస్తోంది. కారు ముందు భాగంలో క్రోమ్ ఫినిషింగ్‌తో ఉన్న మెష్ గ్రిల్, మధ్యలో రెనాల్ట్ కొత్త లోగో ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనికి ఇరువైపులా ఉన్న ఎల్‌ఈడీ డీఆర్ఎల్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి.
కారును పక్క నుంచి గమనిస్తే, స్లోపింగ్ రూఫ్‌లైన్, 20 ఇంచ్ భారీ అలాయ్ వీల్స్ కంటికి అట్రాక్టివ్‌గా అనిపిస్తాయి. ఇక కారు వెనుక భాగంలో పదునైన డిజైన్‌తో కూడిన ఆరో ఆకారం టెయిల్ లైట్లు, గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ ఉన్న బంపర్ చూస్తుంటే ఇది నిజంగా ఒక లగ్జరీ కారులా అనిపిస్తుంది. లోగో కిందే ‘రఫేల్’ అని రాసి ఉన్న విధానం చాలా బాగుంది.
- మరింత స్టైలిష్‌గా 2026 టాటా పంచ్- మూడు రోజుల్లో ఫేస్‌లిఫ్ట్ లాంచ్- పూర్తి వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కారు లోపల అంతా లగ్జరీనే!
అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న రెనాల్ట్ రఫేల్ ఇంటీరియర్ చూస్తే టెక్నాలజీ ప్రియులకు పండగే!
డిస్‌ప్లే: డ్యాష్‌బోర్డ్‌పై నిలువుగా ఉండే 24 ఇంచ్ భారీ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణ.
ఆడియో: మ్యూజిక్ ప్రియుల కోసం 12 స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్.
లగ్జరీ: పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు.
స్టీరింగ్: కొత్త రకం టూ-స్పోక్ స్టీరింగ్ వీల్.
పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్..
పర్ఫార్మెన్స్ విషయంలోనూ ఈ రఫేల్ కూపే- ఎస్‌యూవీ చాలా పవర్‌ఫుల్. ఇందులో 1.2 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేశారు. ఇది మొత్తం 200 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఇక హై-ఎండ్ వేరియంట్లలో వెనుక యాక్సిల్ వద్ద అదనంగా మరో ఎలక్ట్రిక్ మోటార్‌ను జోడించడం ద్వారా 4×4 సిస్టమ్‌తో వస్తుంది. ఇది ఏకంగా 300 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేయడం విశేషం.
ఒకవేళ ఈ రెనాల్ట్ రఫేల్ మన దేశంలో విడుదలైతే, ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీని ఇస్తుందనడంలో సందేహం లేదు.


































