ఎన్‌ఆర్ఐ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే “నెలనెలా తెలుగు వెలుగు” కార్యక్రమాన్ని ఈనెల 25న నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు.
ఈనెల చివరి ఆదివారం 76వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ఘనమైన “నా భారతదేశపు గణతంత్ర దినోత్సవం” (దేశభక్తి గీతాలతో భూమి భారతికి స్వరనీరాజనం) అనే అంశంపై నెలనెలా తెలుగు వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు నిరంజన్, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ల శ్రీనివాస్, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర వెల్లడించారు. ఈనెల నిర్వహించే కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాలుగు దశబ్దాలకు పైగా భారత సైన్యంలో వివిధ హోదాల్లో మాతృదేశానికి సేవలు అందించిన విశ్రాంత మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కె.రామచంద్రరావు హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ గాయనీ, గాయకులు దేశభక్తి పూర్వక లలిత గీతాలు ఆలపిస్తారని డాక్టర్ ప్రసాద్ తోటకూర చెప్పారు. విశ్రాంత ఆకాశవాణి కళాకారులు, ప్రముఖ గేయ రచయిత, స్వరకర్త లలిత సంగీత చక్రవర్తి కలగా కృష్ణమోహన్, గాయత్రి నారాయణ్, రావూరి మాధవి, శీలం రమణ, ఎంఆర్కే ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే నెలనెలా తెలుగు వెలుగు అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో సాహితీ ప్రియులంతా పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు https://www.tana.org సంప్రదించాలని ప్రసాద్ తోటకూర సూచించారు.