Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. పార్టీ సమావేశంలో దీనిపై కీలక తీర్మానం చేశారు.
దిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నీతీశ్ (Nitish Kumar) కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మోదీ సర్కారుకు గట్టి మెలిక పెట్టింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లకు తెరతీసింది. తమ రాష్ట్రం బిహార్ (Bihar)కు ప్రత్యేక హోదా (Special Category Status) ఇవ్వాలని అడిగింది. ఈమేరకు పార్టీ సమావేశంలో దీనిపై తీర్మానం చేసింది.
జనతాదళ్ (యునైటెడ్) జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఇందులో బిహార్‌కు ప్రత్యేక హోదా (Special Status for Bihar) లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీంతోపాటు ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక, కఠినచట్టం చేయాలని కోరింది.
బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్ గతేడాది నవంబరులో ఆమోదించింది. అయితే, అప్పటికి నీతీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కూటమికి గుడ్‌బై చెప్పిన సీఎం.. మళ్లీ భాజపా గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ ఉంది. ఈ క్రమంలోనే ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని నీతీశ్ పార్టీ తాజాగా లేవనెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సమావేశం అనంతరం జేడీయూ (JDU) సీనియర్ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదు. రాష్ట్ర వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ’’ అని అన్నారు. ఇక, ఇదే సమావేశంలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్ నేత సంజ్‌ఝాను ఎన్నుకొన్నారు.