30, 40, మరియు 50 సంవత్సరాలలో పదవీ విరమణ కోసం ఇలా ప్లాన్ చేసుకోవాలి.

జీవితంలో మరలా దశ ఆర్థిక అవసరాలను సమకూర్చుకునేందుకు వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించడం మంచిది. ఈ ప్లానింగ్ లో ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలు, మెడికల్ ఖర్చులు, ఆయుర్దాయం వంటి అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే రిటైర్మెంట్ తర్వాత జీవితానికి అవసరమైన నిధులను సేకరించగలం. కానీ, తక్కువ ఆదాయం, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ వంటి సవాళ్ల కారణంగా చాలా మంది కెరీర్ ప్రారంభం నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ కు శ్రీకారం చుట్టలేకపోతున్నారు. ఆలస్యమైనా పర్వాలేదు.. ఏదో ఒక దశలో మొదలు పెట్టడం చాలా ముఖ్యం. అవసరం కూడా. ఇప్పుడు 30, 40, 50 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించే వారు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాం..


30 ఏళ్ల వయసులో..

మీ నెలవారీ ఎక్స్పెన్సెస్ ₹30,000 అనుకుందాం. ప్రతి సంవత్సరం 5% చొప్పున పెరుగుతుంటే, మీరు రిటైర్ అయ్యే సమయానికి మీ నెలవారీ ఖర్చులు ₹1.33 లక్షలకు చేరుకోవచ్చు. అంటే రిటైర్మెంట్ తర్వాత మొదటి సంవత్సరంలో మీకు ₹16 లక్షలు అవసరం. 5% ఇన్ఫ్లేషన్ ను పరిగణనలోకి తీసుకుంటే, 80 ఏళ్ల వరకు మొత్తం ₹5.3 కోట్లు అవసరం. కాబట్టి, లాంగ్ టర్మ్ లో హై రిటర్న్స్ ఇచ్చే ఈక్విటీస్, ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఉదాహరణకు, 30 ఏళ్ల వయసులో ఈక్విటీ ఫండ్ లో నెలకు ₹2,000 తో SIP ప్రారంభించి, ప్రతి సంవత్సరం ఈ మొత్తాన్ని 10% పెంచుకుంటే, రిటైర్మెంట్ తర్వాత అవసరాలను తీర్చుకోగలుగుతారు. రిటైర్మెంట్ సమయానికి మీరు మొత్తం ₹40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. 15% అనువల్ రిటర్న్ తో, మీ ఫండ్ వాల్యూ ₹2.53 కోట్లకు చేరుకుంటుంది. రిటైర్మెంట్ తర్వాత, SIP నుండి SWP కు మారాలి. మీ ఫండ్ నుండి 20 ఏళ్ల పాటు నెలకు ₹1.33 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ మొత్తాన్ని 10% పెంచుకుంటే, 80 ఏళ్ల వరకు మీ ఫండ్ లో ₹8 కోట్లు మిగులుతాయి.

40 ఏళ్ల వయసులో..

ఈ వయసులో మీ నెల ఖర్చులు ₹40,000 అనుకుందాం. ఇన్ఫ్లేషన్ ను పరిగణనలోకి తీసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత మొదటి నెలలో ₹1.1 లక్షలు అవసరం. ఖర్చులు ప్రతి సంవత్సరం 5% పెరిగితే, రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్లకు ₹4.3 కోట్లు అవసరం. ఈ వయసులో రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభిస్తున్నందున, ఎక్కువ సమయం లేదు. కాబట్టి, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లో ఎక్కువ మొత్తంలో SIP చేయడం మంచిది. నెలకు ₹12,000, ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటే, 12% రిటర్న్ తో రిటైర్మెంట్ సమయానికి మీ ఫండ్ ₹2.24 కోట్లకు చేరుకుంటుంది. రిటైర్మెంట్ తర్వాత SWP ద్వారా నెలకు ₹1.1 లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు.

50 ఏళ్ల వయసులో..

ఈ వయసులో రిటైర్మెంట్ ప్లానింగ్ చాలా లేట్ అయినా, సాధ్యమే. ఈ వయసులో మీ నెల ఖర్చులు ₹50,000 అనుకుంటే, రిటైర్మెంట్ తర్వాత మొదటి నెలలో ₹82,000 అవసరం. 60 ఏళ్ల నుండి 80 ఏళ్ల వరకు ₹3.2 కోట్లు అవసరం. ఈ కార్పస్ ను సృష్టించడానికి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో నెలకు ₹50,000 SIP చేస్తే, 12% రిటర్న్ తో రిటైర్మెంట్ సమయానికి మీ ఫండ్ ₹1.64 కోట్లకు చేరుకుంటుంది. రిటైర్మెంట్ తర్వాత SWP ద్వారా నెలకు అవసరమైన మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు.